Kadem Project: ‘కడెం’ దడ

14 Jul, 2022 05:08 IST|Sakshi
గండిపడిన కడెం ఎడమకాల్వ

భారీ వర్షాలకు నిండిన ప్రాజెక్టు

నీటిని విడుదల చేసే సామర్థ్యానికి మించి వరద.. ప్రాజెక్టు తెగేట్టు ఉందంటూ అధికారుల సైరన్‌

ఊళ్లలో చాటింపు.. మంగళవారమే సురక్షిత ప్రాంతాలకు తరలింపు

తరలింపు ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

బుధవారం అర్ధరాత్రి వరకూ ప్రమాదకరంగానే ప్రాజెక్టు పరిస్థితి

నిర్మల్‌/కడెం: మంగళవారం అర్ధరాత్రి.. జోరు వాన.. పెద్ద శబ్ధంతో సైరన్‌ మొదలైంది. ఇదేమిటని జనం ఇళ్లలోంచి బయటికి వచ్చేప్పటికే డప్పు చాటింపు చప్పుడు.. ‘‘ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నందున కడెం ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఉన్నఫళంగా అందరూ ఇళ్లు వదిలి మన ఊరి బడి కాడికి రావాలహో..’అంటూ వినపడిన చాటింపు అంత వానలోనూ ఊరివాళ్లకు చెమటలు పట్టించింది. వెంటనే ఊరు ఊరంతా అన్నీ వదిలి బయటికి వచ్చేశారు. నిర్మల్‌ జిల్లా కడెం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి పరిస్థితి ఇది. ఇక్కడి కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఒక్కసారిగా 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తింది. 

గేట్లన్నీ ఎత్తివేసినా..
ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు పడటంతో అక్కడి నుంచి వాగుల్లో భారీ వరద మొదలైంది. దానికితోడు మంగళవారం సాయంత్రం నుంచి నిర్మల్, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో కురిసిన వాన నీళ్లూ కడెం వైపు పరుగులు తీస్తూ వచ్చాయి. మహారాష్ట్రలోని వాగుల సమాచారం తెలియకపోవడం, అటవీ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాల స్థాయి తెలిసే పరిస్థితి లేకపోవడంతో.. అధికారులు భారీ వరదను అంచనా వేయలేకపోయారు. ఒక్కసారిగా ఐదు లక్షల క్యూసెక్కుల వరద రావడంతో అవాక్కయ్యారు. అప్పటికప్పుడు మొత్తం 18 గేట్లలో 17 గేట్లను ఎత్తేశారు. ఒక గేటు మొరాయించడంతో వదిలేశారు. అయితే ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తేసినా విడుదలయ్యే నీరు మూడు లక్షల క్యూసెక్కుల లోపే కావడం.. ఇన్‌ఫ్లో మాత్రం ఐదు లక్షల క్యూసెక్కులు ఉండటం.. ఇది 1955లో కట్టిన పాత ప్రాజెక్టు కావడంతో.. అధికారులు అర్ధరాత్రి దాటాక ప్రమాద ఘంటికలు మోగించారు. ఒక్కసారిగా వచ్చిన వరదతో కడెం పరీవాహక ప్రాంతంలో పంటచేలన్నీ కొట్టుకుపోయాయి. కిలోమీటర్ల పొడవు రోడ్లు తెగిపోయాయి.

అర్ధరాత్రి అప్రమత్తమై.. 
కడెం ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి వచ్చిందన్న విషయం తెలియగానే కలెక్టర్‌ ముషరఫ్‌ అలీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, పలు శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రే కలెక్టర్, ఇతర అధికారులు నిర్మల్‌ నుంచి బయలుదేరారు. ఖానాపూర్‌ మీదుగా వెళ్లే 61 నంబర్‌ జాతీయ రహదారి తెగిపోవడంతో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల మీదుగా చుట్టూ తిరిగి కడెం చేరుకున్నారు. అప్పటికే స్థానిక అధికారులకు సమాచారమిచ్చి.. ప్రాజెక్టు దిగువన ఉన్న కడెం, దస్తురాబాద్‌ మండలాల్లోని 12 గ్రామాలను ఖాళీ చేయించడం మొదలు పెట్టారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ఉదయమే కడెం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ఎడమ కాలువకు గండి పడటంతో..
పరిమితికి మించి వచ్చిన వరదతో ప్రాజెక్టు ఎడమ కాల్వ గేట్లపై నుంచి నీళ్లు పొంగి పొర్లాయి. దీనితో బుధవారం మధ్యాహ్నం ఎడమ కాల్వ వద్ద గండిపడి.. నీళ్లు దిగువకు వెళ్లిపోతున్నాయి. అయితే ఈ గండి వల్లే ప్రాజెక్టుపై భారం తగ్గిందని అధికారులు చెప్తుండగా.. ఆ గండి పెరిగి ప్రమాదకరంగా మారొచ్చన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో కాస్త తగ్గుముఖం పట్టిందని, ఇంకా తగ్గితే ప్రమాదం తప్పినట్టేనని కలెక్టర్‌ ప్రకటించారు. అయితే వానలు పడుతూనే ఉండటం, మరింత పెరగొచ్చనే వాతావరణ శాఖ సూచనలతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు