కలిసి కట్టుగా కదిలారు.. అక్రమార్కుల భరతం పట్టారు

8 Jun, 2022 18:49 IST|Sakshi

కజ్జర్ల, కుచులాపూర్‌లలో రైతుల భూమి ఆక్రమణకు యత్నం

ఎప్పుడో అమ్మిన భూమికి వారసులమంటూ దౌర్జన్యం

బాధితులకు మద్దతుగా కదిలిన గ్రామస్తులు

విత్తనాలతో విప్లవాత్మక చర్యకు శ్రీకారం చుట్టారు ఆదిలాబాద్‌ జిల్లా వాసులు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కునేందుకు ప్రయత్నించిన అక్రమార్కులకు సరైన గుణపాఠం చెప్పారు. అన్నదాతలకు అండగా తాము ఉన్నామంటూ భరోసాయిచ్చారు. 

తలమడుగు: తన భూమిని కబ్జా చేసేందుకు కొందరు యత్నించి దాడి చేయడంతో జైపాల్‌రెడ్డి అనే రైతు మనస్తాపం చెందాడు. కొడుకు చరణ్‌రెడ్డితో కలిసి పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆ రైతు కష్టం చూసి ఊరి ప్రజలంతా ఏకమయ్యారు. చందాలతో విత్తనాలు కొని ఆ రైతు భూమిని చదును చేసి పత్తి విత్తనాలు వేశారు. భూకబ్జాకు యత్నిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో జరిగింది. 


ఒక్కడి కోసం అందరూ..!

అదే రోజు మండలంలోని కుచులాపూర్‌ గ్రామంలో అదే తరహలో మరో ఘటన జరిగింది. రైతు మీసాల లింగన్న 25 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమి తమదని కొంతమంది ఆదిలాబాద్‌కు చెందిన అబ్దుల్‌ రజాక్, అబ్దుల్‌ సాజిద్, రజాక్‌ వచ్చి చేనులో పత్తి విత్తనాలు నాటారు. ఆరోజు లింగన్న గ్రామంలో లేకపోవడంతో విషయం బయటకు రాలేదు. తాజాగా మంగళవారం చేనును పరిశీలించిన రైతు లింగన్న ఆందోళన చెందాడు. విషయాన్ని గ్రామస్తులకు తెలుపగా బాధిత రైతుకు మద్దతుగా అందరూ ఒక్కటయ్యారు. అరకలు పట్టుకుని లింగన్న చేను వద్దకు వెళ్లి.. ఆక్రమణదారులు నాటిన పత్తి విత్తనాలను చెడగొట్టారు. తర్వాత లింగన్న గ్రామస్తుల సాయంతో తాను పత్తి విత్తనాలు నాటాడు. 

ఈ సందర్భంగా లింగన్న మాట్లాడుతూ తాను 25 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన అబ్దుల్‌ బాబుసేట్‌ వద్ద ఎకరాకు రూ.50 వేల చొప్పున నాలుగు ఎకరాలు కొనుగోలు చేసినట్లు చెప్పాడు. తండ్రి అమ్మిన ఇప్పుడు కొడుకులు, బంధువులు వచ్చి భూమి తమదని ఆక్రమించుకోవడం ఏమిటని ప్రశ్నించాడు. గ్రామస్తులు కూడా మరోమారు ఎవరైనా లింగన్న పొలంలో అడుగు పెడితే ఊరుకోమని హెచ్చరించారు. తర్వాత రైతు లింగన్న తలమడుగు పోలీస్‌ స్టేషన్‌లో అబ్దుల్‌ రజాక్, అబ్దుల్‌ సాజిద్, రజాక్‌పై ఫిర్యాదు చేశాడు.   


జైపాల్‌రెడ్డి పొలాన్ని పరిశీలించిన ఆర్డీవో

తమడుగు: మండలంలోని కజ్జర్ల గ్రామంలో రైతు జైపాల్‌రెడ్డి పొలాన్ని ఆర్డీవో రాథోడ్‌ రమేశ్‌ మంగళవారం పరిశీలించారు. జైపాల్‌రెడ్డి పొలం పక్క పొలం రైతుల వివరాలు తెలుసుకున్నారు. ఆసర్వే నంబర్లలో ఎంత భూమి ఉంది, పక్కన గల రైతు స్వామి పొలాన్ని చుట్టు పక్కల హద్దుల వివరాలను, రెండు రోజుల్లో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్, సర్వేయర్‌ మనోజ్‌ను ఆదేశించారు. రైతు జైపాల్‌రెడ్డికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆర్డీవో వెంట గ్రామస్తులు కిరణ్, జైపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ నారాయణరెడ్డి ఉన్నారు. 

మరిన్ని వార్తలు