అన్ని అనుకూలతలు ఉన్నా వెనుకబడే దుస్థితి ఎందుకు?: సీఎం కేసీఆర్‌ 

2 Oct, 2022 02:32 IST|Sakshi

అన్నపూర్ణగా నిలవాల్సిన మనం దిగుమతులపై ఆధారపడుతున్నాం..

నీచ ప్రయోజనాల కోసం కొందరు విష బీజాలు నాటుతున్నారు 

దీన్ని సంస్కరించడానికి మన వంతు కృషి చేయాలి 

రాజకీయాల కోసం కేంద్ర మంత్రుల ఆరోపణలు 

‘జై తెలంగాణ.. జై భారత్‌’ అంటూ ప్రసంగం ముగింపు 

వరంగల్‌ శివార్లలో ములుగు క్రాస్‌రోడ్డు వద్ద ప్రతిమ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం

సాక్షిప్రతినిధి, వరంగల్‌:  ‘‘ప్రపంచంలో ఏ దేశానికీ లేని అనుకూలతలు భారత్‌కు ఉన్నాయి. అయినా ప్రపంచ దేశాలతో పోలిస్తే వెనుకబడింది. ప్రపంచానికే అన్నపూర్ణగా నిలవాల్సిన మనం విదేశీ ఆహార పదార్థాల మీద ఆధారపడుతున్నాం. ఎందుకు మనకీ దుస్థితి. దేశం వంచనకు గురవుతోంది. అందరినీ కలుపుకొని పోయే పూలబొకే లాంటిది ఈ భారతదేశం. కానీ కొందరు దుర్మార్గులు నీచ ప్రయోజనాల కోసం దేశంలో విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు.

దీన్ని సంస్కరించడానికి, దేశాన్ని మంచి మార్గంలో నడిపించడానికి మన వంతు కృషి చేయాలి..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ఏ రంగంలో చూసినా ఈరోజు తెలంగాణ దేశంలో నంబర్‌ వన్‌ రాష్ట్రంగా, దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. శనివారం వరంగల్‌ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. జిల్లా కేంద్రానికి సమీపంలోని ములుగు క్రాస్‌రోడ్‌ వద్ద ప్రతిమ రిలీఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ మెడికల్‌ కాలేజీని, ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..  

కేంద్ర మంత్రులవి రాజకీయాలు 
‘‘ఉద్యమ సమయంలో నేను ప్రజలకు ఏదైతే పదే పదే చెప్పానో అది వందకు వందశాతం ఈ రోజు సాకారం అవుతోంది. చాలా అద్భుతంగా, దేశంలోనే ధనిక రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని చెప్పిన. అదే జరుగుతోంది. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై ఉన్న మహారాష్ట్ర కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ. జీఎస్‌డీపీ వృద్ధి కూడా ఎక్కువ. అయినా రాజకీయాల కోసం కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చి కేసీఆర్‌ను తిట్టిపోతారు. అక్కడ ఢిల్లీలో అవార్డులు ఇస్తారు. అవి రాజకీయాలు. వాటి విషయం వేరు. ఇది అందరూ గమనించాలి. ఏ దేశమైనా, ఏ సమాజమైనా ఎప్పటికప్పుడు తమ చుట్టూ సంభవించే పరిణామాలను గమనిస్తూ ఉండాలి. 

వనరులున్నా భారత్‌ వెనుకబాటు 
ఏ దేశానికి లేని అనుకూలతలు భారత్‌కు ఉన్నాయి. అయినా ప్రపంచ దేశాలతో పోలిస్తే వెనుకబడింది. దేశంలో మొత్తం 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. అద్భుతమైన వ్యవసాయ అనుకూల వాతావరణముంది. భారతదేశం ప్రపంచానికే అన్నపూర్ణ. మనదేశం కంటే 3రెట్లు పెద్దగా ఉండే అమెరికాలో వ్యవసాయానికి అనుకూలమైన భూమి కేవలం 29 శాతమే. మనకంటే రెండింతలుండే చైనాలో ఇది 16 శాతమే.

కానీ మన దేశం విస్తరించి ఉన్న 83 కోట్ల ఎకరాల భూభాగంలో సగం దాకా.. అంటే 41 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. అయినా విదేశీ ఆహార పదార్థాల మీద ఆధారపడుతున్నాం. ప్రపంచానికే ఆహారం అందించగల మన దేశం వంచించబడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో వేల మంది రైతులు 13 నెలలకుపైగా ధర్నాలు చేసే పరిస్థితి నెలకొంది. ఎందుకు మనకీ దుస్థితి. మన చుట్టూ ఏం జరుగుతుందో అందరం పరికించి చూడాలి. దీన్ని సంస్కరించడానికి, మంచి మార్గంలో నడిపించడానికి మన వంతు కృషి చేయాలి. అందరినీ కలుపుకొని పోయే పూలబొకే లాంటిది ఈ భారతదేశం. కానీ కొందరు దుర్మార్గులు నీచ ప్రయోజనాల కోసం దేశంలో విష బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. అది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. 

త్వరలో తెలంగాణ హెల్త్‌ ప్రొఫైల్‌ 
తెలంగాణలో ప్రతి ఒక్కరికీ హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేయాలని సంకల్పించాం. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఇది ముందుకు సాగుతుంది. ప్రయోగాత్మకంగా సిరిసిల్ల, ములుగులో 100% హెల్త్‌ప్రొఫైల్‌ తయారుచేశాం.ప్రతి వ్యక్తి బ్లడ్‌గ్రూపు, ఇతర ఆరోగ్య వివరాలన్నీ నమోదు చేశాం. అన్ని నియోజకవర్గాల్లో ఈ హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టు పూర్తయితే.. ఏ వ్యక్తికి ఏరకమైన ఆరోగ్య సమస్య వచ్చినా.. నిమిషంలోనే వారి పరిస్థితిని అంచనా వేయవచ్చు. అవసరమైన వైద్యసేవలను అందించవచ్చు. 

వరంగల్‌లోనే అత్యుత్తమ వైద్యసేవలు 
వరంగల్‌తోపాటు కరీంనగర్, ఖమ్మం జిల్లాల ప్రజల కోసం వరంగల్‌లో హైదరాబాద్‌ను మించిన అద్భుత సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వస్తోంది. 2 వేల పడకలతో 24 అంతస్తుల్లో నిర్మాణం అవుతోంది. వరంగల్‌ వాళ్లు హైదరాబాద్‌కు వెళ్లడం కాదు. హైదరాబాద్‌ వాళ్లే వరంగల్‌కు వచ్చేలా ఈ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఉంటుంది..’’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. చివరిలో ‘జై తెలంగాణ.. జై భారత్‌’ అంటూ ప్రసంగాన్ని ముగించారు.

కాగా ప్రతిమ రిలీఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్, మెడికల్‌ కాలేజీలను నిర్మించిన ప్రతిమ గ్రూప్‌ చైర్మన్‌ బోయినిపల్లి శ్రీనివాసరావును కేసీఆర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌ కుమార్, పసునూరి దయాకర్, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

త్వరలోనే హెల్త్‌ మిషన్‌ పూర్తి 
మీ అందరికీ శుభవార్త తెలియజేస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపించి కేంద్ర ప్రభుత్వ రంగంలో ఒక్క మెడికల్‌ కాలేజీని మంజూరు చేయకపోయినా.. మనకు స్వశక్తి ఉంది కాబట్టి తెలంగాణలో జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నాం. కొద్దిరోజుల్లోనే ఈ మిషన్‌ పూర్తి అవుతుంది. తెలంగాణలో రాష్ట్ర ఏర్పాటుకు ముందు కేవలం 2,800 మెడికల్‌ సీట్లు ఉండేవి. ఇప్పుడు 6,500 సీట్లకు పెరిగాయి. అన్ని జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు పూర్తయితే 10వేల ఎంబీబీఎస్‌ సీట్లు ఉంటాయి. ఇక్కడి పిల్లలు, రష్యాకు, చైనాకు, ఉక్రెయిన్‌కు పోయే పరిస్థితి రాదు. ఇక్కడే మన విద్యార్థులు ఏ ఇబ్బందీ లేకుండా చదువుకోవచ్చు. గతంలో 1,150 పీజీ సీట్లు మాత్రమే ఉండేవి. ఈరోజు 2,500కు పెరిగాయి.  – సీఎం కేసీఆర్‌  

మరిన్ని వార్తలు