నేడు కృష్ణా, గోదావరి వరదలపై కీలక సమావేశం..కృష్ణా బోర్డు భేటీ వాయిదా!

25 May, 2021 04:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో దిగువ రాష్ట్రాలకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు కృష్ణా గోదావరి బేసిన్‌ ఆర్గనైజేషన్‌ (కేజీబీవో) మంగళవారం కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బేసిన్‌ పరిధిలోని రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేజీబీవో సీఈ డి.రంగారెడ్డి వర్చువల్‌ విధానంలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సీజన్‌లో కృష్ణా, గోదావరి నదులకు వరద వచ్చే సమయంలో.. వరద ముప్పును తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎగువ రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనున్నారు.

కృష్ణా బేసిన్‌లోని జలాశయాల్లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరాకగానీ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయడం లేదు. గరిష్టంగా వరదను ఒకేసారి విడుదల చేయడం వల్ల దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద బారిన పడుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటున్న ఏపీ, తెలంగాణ.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కనీసం తాగడానికి కూడా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని నదీ బేసిన్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వరద సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలు, దిగువ రాష్ట్రాలతో సమాచార మార్పిడి తదితర అంశాలపై ఆయా రాష్ట్రాలకు మార్గదర్శనం చేయనున్నారు.  

కృష్ణా బోర్డు భేటీ వాయిదా 
సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా నదీ జలాల పంపకాలపై చర్చించేందుకు మంగళవారం జరగాల్సిన కృష్ణా బోర్డు భేటీ వాయిదా పడింది. యాస్‌ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జల వనరుల శాఖ అధికారులంతా దానిని ఎదు ర్కొనే కార్యాచరణలో నిమగ్నమై ఉన్నారు. దీనికితోడు కేంద్రం ఆదేశాల మేరకు పోల వరం ప్రాజెక్టును పూర్తి చేయడంపై అధికార యంత్రాంగం ఉన్నందున మంగళవారం నాటి భేటీని వాయిదావేయాలని ఆంధ్రప్రదేశ్‌ బోర్డును కోరింది. ఈ నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.  

మరిన్ని వార్తలు