కొంపముంచిన గూగుల్‌ మ్యాప్స్‌.. ఎగ్జామ్‌ రాయలేకపోయిన ఇంటర్‌ విద్యార్థి

15 Mar, 2023 15:21 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకొని ఓ ఇంటర్‌ విద్యార్థి మోసపోయాడు. గూగుల్‌ మ్యాప్‌లో తాను వెళ్లాల్సిన ఎగ్జామ్‌ సెంటర్‌ కాకుండా వేరే లొకేషన్‌  చూపించడంతో తప్పుడు అడ్రస్‌కు వెళ్లాడు. గూగుల్‌ తప్పిదాన్ని గ్రహించిన విద్యార్థి.. మళ్లీ సరైన పరీక్షా కేంద్రానికి వచ్చినా.. అప్పటికే ఆలస్యం కావడంతో తొలిరోజు పరీక్ష రాయలేకపోయాడు. దీంతో చేసేదేం లేక బాధతో తిరిగి వెళ్లిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో బుధవారం చోటుసుకుంది. 

ఖమ్మం రూరల్‌ మండలం కొండాపురం గ్రామానికి చెందిన విద్యార్థి వినయ్‌ ఇంటర్‌ చదువుతున్నాడు. బుధవారం ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కావడంతో ఎగ్జామ్‌ హాలుకు వెళ్లేందుకు గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకున్నాడు. అందులో చూపించిన డైరెక్షన్‌లో వెళ్లాడు. అయితే తాను వెళ్లాల్సిన లొకేషన్‌కు కాకుండా మరో ప్లేస్‌కు గూగుల్‌ మ్యాప్స్‌ తీసుకెళ్లింది.

అయితే అక్కడికి చేరుకున్న తర్వాత అది తాను పరీక్ష రాయాల్సిన సెంటర్ కాదని తెలిసింది. దీంతో హడావుడిగా వేరేవాళ్లను అడ్రస్‌ అడుక్కుంటూ పరీక్షా కేంద్రానికి వచ్చాడు. కానీ వినయ్‌ అప్పటికే 27 నిమిషాలు ఆలస్యంగా ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకున్నాడు. నిమిషం నిబంధన కఠినంగా ఉండటంతో విద్యార్థినిపరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు సిబ్బంది నిరాకరించారు. దీంతో చేసేదేమీ లేక బాధతో వినయ్‌ ఇంటికి చేరుకున్నాడు.

మరిన్ని వార్తలు