కోమటిరెడ్డి ఆడియో కలకలం.. క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ

6 Mar, 2023 11:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, ఆయన కుమారుడు డాక్టర్‌ సుహాస్‌ను తన వాళ్లు చంపేస్తారంటూ బెదిరింపులకు పాల్పడిన ఫోన్‌కాల్‌ రికార్డింగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, రాజకీయంగా ఆయన వ్యాఖ్యలు చర్చనీ​యాంశంగా మారాయి. 

ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. వెంకట్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే.. వేరే ఉద్దేశం లేదు. నా 33 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఎవరినీ దూషించలేదు. శత్రువును కూడా దగ్గరకు తీసే తత్వం నాది. చెరుకు సుధాకర్‌పై పీడీ యాక్ట్‌ పెడితే నేనే కొట్లాడాను. నాపై విమర్శలు వద్దనే సుధాకర్‌ కుమారుడికి చెప్పాను. నా మాటలను కట్‌ చేశారు. కొన్ని అంశాలు మాత్రమే లీక్‌ చేశారు. ఫోన్‌ రికార్డు చేస్తున్న విషయం నాకు కూడా తెలుసు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాటి నుంచి చెరుకు సుధాకర్‌ నన్ను తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నావని అడిగాను. నన్ను తిట్టొదు అని మాత్రమే సుహాస్‌కు చెప్పాను. నన్ను సస్పెండ్‌ చేయాలి అనడం, తిట్టడం వల్లే బాధతో అలా మాట్లాడాను’ అని తెలిపారు. 

ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి ఆడియో క్లిప్‌లో ‘మీ నాన్న వీడియో చూసినవా? ఇప్పటికే నన్ను వందసార్లు తిట్టిండు. నెలరోజుల నుంచి ఓపిక పడుతున్నా. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చి నన్ను విమర్శిస్తాడా? వాడిని వదిలేది లేదు. వాడు (చెరుకు సుధాకర్‌) క్షమాపణ చెప్పకపోతే మా వాళ్లు చంపుతరు. నా అభిమానులు వంద కార్లల్లో బయల్దేరారు. ఇంటి పార్టీ ఏందిరా? వాడు పీడీ యాక్ట్‌ కేసులో జైల్లో పడితే నేను ఒక్కడినే వెళ్లి పరామర్శించిన. కౌన్సిలర్‌గా గెలవనోడు నన్ను విమర్శిస్తాడా? 25 ఏండ్ల నా రాజకీయ జీవితంలో లక్షల మందిని బతికించిన. వారిలో చాలామంది ఇప్పటికే వాడి మీద కోపంతో చంపుతామంటూ బయల్దేరారు. నేను ఎంతమందినని ఆపుతా. నిన్ను కూడా చంపేస్తరు. నీ హాస్పిటల్‌ ఉండదు. వారంలో వాడిని చంపేస్తారు’ అని సీరియస్‌ అయ్యారు. 

చెరుకు సుధాకర్‌ సీరియస్‌..
ఈ ఆడియోను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు థాక్రే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి పంపించానని సుధాకర్‌ తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే దృష్టికి కూడా తీసుకెళ్తానన్నారు. ఎంపీ కోమటిరెడ్డి.. తనపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై అధిష్టానమే చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు.. కోమటిరెడ్డిపై సుహాస్‌ నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు కోమటిరెడ్డి నుంచి ప్రాణభయం ఉన్నదని, రక్షణ కల్పించి ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు