‘కృష్ణా’ వాసుల కష్టాలు.. ఆగని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. కర్ణాటకలోని రాయచూర్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సిందే!

27 May, 2022 19:14 IST|Sakshi
కృష్ణా రైల్వేస్టేషన్‌లో ఎక్కుతున్న ప్రయాణికులు(ఫైల్‌) 

కృష్ణా (మహబూబ్‌నగర్‌): కృష్ణా రైల్వేస్టేషన్‌కు ఓ విశిష్టమైన చరిత్ర ఉంది. దేశంలో మొదటిసారి రైల్వేలైన్‌ ఏర్పాటు చేసిన సమయంలోనే ఈ రైల్వేస్టేషన్‌ ఏర్పడింది. అప్పటి నుంచి  ఈ ప్రాంతంలోని కృష్ణానదిలో పూజ కార్యక్రమాలకు మహారాష్ట్ర, కర్ణాటక తదితర సూదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు భక్తులు వచ్చేవారు. ఆ భక్తులకు ఉపయోగపడే విధంగా ఈ స్టేషన్‌లో అన్ని సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలిపేవారు.

కాగా కరోనా మహామ్మారి కారణంగా గత కొంత కాలంగా ఈ స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఇక్కడ నిలపకుండగా రద్దు చేశారు. దీంతో కృష్ణానదికి వచ్చే భక్తులు చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ప్రాంత ప్రజలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు గాను పక్కన ఉన్న కర్ణాటకలోని రాయచూర్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుందన్నారు. తక్షణమే గతంలో మాదిరిగా ఈ స్టేషన్‌లో  రైళ్లను అన్నింటిని నిలిపే విధంగా తగు చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు, కేంద్ర రైల్వే మంత్రికి ప్రత్యేక విజ్ఞప్తులు చేశారు.

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలపాలని రైల్వేజీఎంకు విజ్ఞప్తి చేస్తున్న కృష్ణా గ్రామస్తులు (ఫైల్‌) 

అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ విషయంపై రైల్వే స్టేషన్‌ ముందు అఖిల పక్షాల మద్దతుతో రిలే నిరాహార దీక్షలు చేపడుతామని అంటున్నారు. ఈ ప్రాంత నుంచి ప్రతి నిత్యం వందలాది మంది ప్రయాణికులు ముంబాయి, చెన్నై, బెంగుళూర్‌ ప్రాంతాలకు వెళ్తుంటారు. వారు ప్రస్తుతం ఇక్కడ రైళ్లను నిలపకపోవడంతో రాయచూర్‌ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుంది. దీని మూలంగా కృష్ణాలోని చిన్న చిన్న వ్యాపారాలు, ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. ఈ విషయంపై రైల్వే అధికారులు మరోమారు ఆలోచించి తమకు న్యాయం చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 

రిలే నిరాహార దీక్ష చేపడతాం.. 
స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలపాలని అప్పటి కేంద్ర రైల్వే మంత్రిని ఒప్పించాం. అప్పటి నుంచి కృష్ణానదికి వచ్చే భక్తులకు చాల ఉపయోగకరంగా మారింది. అదే సమయంలో జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలకు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపయోగకరంగా ఉండేది. కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లను పునరుద్దరించినా ఈ స్టేషన్‌లో వాటిని నిలపడం లేదు. దీని మూలంగా ప్రయాణికులకు, భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడుతాం. – అమర్‌కుమార్‌ దీక్షిత్, పురోహితుడు. 

కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేస్తాం  
ఈ స్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలపాలని కోరుతూ త్వరలోనే అఖిల పక్షాల అధ్వర్యంలో కేంద్ర రైల్వే మంత్రిని, దక్షణ మధ్య రైల్వే ధ్యెంను కలిసి విజ్ఞప్తి చేస్తాం. అప్పటికి మా సమస్య పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటాం. 
– మహాదేవ్, కృష్ణా మాజీ సర్పంచ్‌  

రాయచూర్‌కు వెళ్తున్నాం  
మా పిల్లలు ఉన్నత చదువుల నిమిత్తం బెంగుళూర్‌లో ఉంటున్నారు. మేము, మా పిల్లలు  బెంగుళూర్‌కు వెళ్లాలంటే రాయచూర్‌ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుంది. గతంలో కృష్ణాలోనే రైళ్లు నిలవడంతో ఇబ్బందులు ఉండేవి కాదు. ఇప్పుడు నిలపకపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.  – విశ్వనాథ్‌గౌడ, గుర్జాల్‌   

మరిన్ని వార్తలు