చట్టబద్ధ హక్కుల కోసం పోరాడుతాం

10 Aug, 2020 03:07 IST|Sakshi

ఏపీతో సత్సంబంధాలున్నా రాష్ట్ర హక్కులపై రాజీలేదు 

కరోనా చికిత్సలో అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు 

రాజ్యాంగ విలువలకు అనుగుణంగా రామరాజ్యం రావాలి 

‘ఆస్క్‌ కేటీఆర్‌’పేరిట ట్విట్టర్‌ వేదికగా నెటిజన్లతో కేటీఆర్‌ సంభాషణ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాలపై తెలంగాణకున్న చట్టబద్ధ హక్కుల కోసం పోరాడతామని, ఆంధ్రప్రదేశ్‌తో సత్సంబంధాలున్నా రాష్ట్ర హక్కులపై రాజీపడేది లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ‘ట్విట్టర్‌’వేదికగా ఆదివారం ‘ఆస్క్‌ కేటీఆర్‌’పేరిట పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. అయోధ్య రామమందిరంలో తెలంగాణ భాగస్వామ్యం గురించి స్పందిస్తూ రాజ్యాంగ విలువలకు అనుగుణంగా కుల, మతాలకతీతంగా సమాన అవకాశాలు, గౌరవం లభించే రామరాజ్యం రావాలని ఆకాంక్షించారు.

విద్యావంతుల మౌనం దేశానికి మంచిదికాదని కేటీఆర్‌ అన్నారు. కరోనా చికిత్సలో అధికచార్జీలు వసూలు చేస్తున్న ఒకటి, రెండు ప్రైవేటు ఆసుపత్రులపై ఇప్పటికే కఠినచర్యలు తీసుకున్నామని కేటీఆర్‌ వెల్లడించారు. రాష్ట్రంలో 12 వందలకుపైగా కేంద్రాల్లో రోజుకు 23 వేలకుపైగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ఇది 40 వేలకు చేరుతుందన్నారు. కరోనా మృతులSసంఖ్య ఒక శాతం కంటే తక్కువగా, రికవరీ రేటు 72 శాతంగా నమోదవుతోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స తర్వాత వేలాదిమంది సురక్షితంగా తిరిగి వెళ్తున్న విషయాన్ని గుర్తించాలని కోరారు. వైద్యరంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

కేంద్రం అనుమతిస్తే ప్రజారవాణా 
కేంద్రం అనుమతిస్తే సిటీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైలు సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్‌ చెప్పారు. మంత్రిగా తాను హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నాననే విమర్శలను ఆయన కొట్టిపారేశారు. ఏడాదిలోగా గ్రామీణ ప్రాంతాల డిజిటలైజేషన్‌ చేస్తామన్నారు. ఎలిమినేడు ఏరోస్పేస్‌ పార్కుకు త్వరలో శంకుస్థాపన చేస్తామని, ఉద్యోగావకాశాలు కల్పించే సంస్థలకు అదనపు రాయితీలు ఇస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండటం వల్లే తాను టీవీ చర్చల్లో పాల్గొనడం లేదని, కరోనా వేళ విద్యార్థుల సమస్యలపై తమ ప్రభుత్వానికి సానుభూతి ఉందన్నారు. బరాక్‌ ఒబామా తనకు ఇష్టమైన నేత అని చెప్పారు. కోవిడ్‌ కేసులను ప్రభుత్వం దాచిపెడుతున్నదనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. పట్టణ సంస్కరణల్లో ‘టీఎస్‌ బీపాస్‌’బెంచ్‌ మార్క్‌గా నిలుస్తుందన్నారు.  

మా శిక్షణ ఎప్పుడు? 
పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా గతేడాది టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్ల పోస్టులకు ఎంపికైన తమకు శిక్షణ ఎప్పుడంటూ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌లో పలువురు అభ్యర్థులు కోరారు. టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థులు అడిగిన ప్రశ్నపై కేటీఆర్‌ స్పందిస్తూ ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డిని కోరతానని చెప్పారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం ప్రారంభోత్సవం కోవిడ్‌ కారణంగా ఆలస్యమైందని, త్వరలోనే పూర్తవుతుందని మంత్రి సమాధానమిచ్చారు.  

మూడో వారంలో కేబుల్‌ బ్రిడ్జి 
ఈ నెల మూడో వారంలో దుర్గంచెరువుపై తీగల వంతెన(కేబుల్‌ బ్రిడ్జి) ప్రారంభం కానుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. కేబుల్‌ బ్రిడ్జితోపాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 45 కారిడార్‌ కూడా ప్రారంభమైతే హైటెక్‌సిటీ వైపు ప్రయాణం సులభమవుతుంది. ట్రాఫిక్‌ చిక్కులు తగ్గుతాయి.

మరిన్ని వార్తలు