ఏదీ నిఘా.. ఉత్తుత్తి చర్యగా మారిన లైసెన్స్‌ రద్దు

4 May, 2022 08:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రవాణాశాఖ రద్దు చేసిన డ్రైవింగ్‌ లైసెన్సులపైన నిఘా కొరవడింది. సాధారణంగా ఒకసారి లైసెన్సు రద్దయ్యాక  ఆరు నెలల పాటు సదరు వాహనదారుడు  బండి నడిపేందుకు  వీలులేదు. 6 నెలల అనంతరం తిరిగి  డ్రైవింగ్‌  లైసెన్సును పునరుద్ధరించుకున్న తరువాత  మాత్రమే  వాహనం నడిపేందుకు అనుమతి లభిస్తుంది. అయితే ఆర్టీఏ, పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా  లైసెన్సుల రద్దు  ప్రక్రియ  ఉత్తుత్తి ప్రహసనంగా మారింది.

నగరంలో రోడ్డు ప్రమాదాలు, మద్యంసేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపైన ఏటా వేల సంఖ్యలో లైసెన్సులు రద్దవుతున్నాయి. కానీ ఇలా రద్దయిన వాహనదారులు యధేచ్చగా  రోడ్డెక్కేస్తూనే ఉన్నారు. మరోవైపు మోటారు వాహన నిబంధనల మేరకు డ్రైవింగ్‌ లైసెస్సు రద్దయినట్లు ఎలాంటి  సమాచారం కానీ, హెచ్చరికలు  రద్దయినట్లు సదరు వాహనదారులకు అందకపోవడం వల్ల అదే పనిగా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు.  

రద్దులోనూ జాప్యం... 
నగరంలో డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో  ప్రతి రోజు పదుల సంఖ్యలో పట్టుబడుతున్నారు. ఇలా వరుసగా డ్రంకెన్‌ డ్రైవ్‌లలో పట్టుపడిన వారి  డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు ఆర్టీఏను సంప్రదిస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా ఆర్టీఏ  అధికారులకు డేటా అందజేయాల్సి ఉంటుంది. కానీ పోలీసులు స్వాధీనం చేసుకున్న  లైసెన్సుల వివరాలను ఎప్పటికప్పుడు రవాణాశాఖకు చేరవేయడంలో జాప్యం చోటుచేసుకుంటుంది.

ఉదాహరణకు జనవరిలో  పట్టుకున్న నిందితుల డేటాను మార్చి నెలలో  ఆర్టీఏకు చేరవేస్తున్నారు. దీంతో మార్చి నుంచి 6 నెలల పాటు అమలయ్యే విధంగా ఆర్టీఏ సదరు డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దు చేస్తుంది. కానీ జనవరిలో పట్టుబడిన నిందితులు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి యధావిధిగా తిరుగుతున్నారు. మార్చి నుంచి ఆరు నెలల పాటు రద్దయిన సమాచారం కూడా వాహనదారులకు సకాలంలో అందడం లేదు. 

ఎం–వాలెట్‌లో చూడాల్సిందే... 
రద్దయిన  డ్రైవింగ్‌ లైసెన్సుల వివరాలు ఆర్టీఏ ఎం–వాలెట్‌లో మాత్రమే నమోదవుతున్నాయి. ఎం–వాలెట్‌ యాప్‌  కలిగి ఉన్న వాహనదారులు ఆ యాప్‌లో తమ డ్రైవింగ్‌ లైసెన్సు ఏ స్థితిలో ఉందో  తెలుసుకుంటే మాత్రమే  సస్పెండ్‌ అయినట్లుగా నోటిఫికేషన్‌ కనిపిస్తుంది. కానీ పోలీసులు, ఆర్టీఏ నిఘా లేకపోవడం వల్ల  డ్రైవింగ్‌ లైసెన్సులు లేకపోయినా యధేచ్చగా రోడ్డెక్కుతున్నారు.   

(చదవండి: పక్కాగా ప్లాన్‌ చేసిన దొరికిపోయాడు!....కథ మొత్తం కారు నుంచే..)

మరిన్ని వార్తలు