మా భూములు మాకివ్వండి

28 May, 2023 03:00 IST|Sakshi

సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటయ్యే దాకా సాగు చేసుకుంటాం 

పురుగుమందు డబ్బాలతో నిర్వాసితుల ఆందోళన 

నాగళ్లతో దున్నేందుకు యత్నం.. అడ్డుకున్న పోలీసులు 

ఆదిలాబాద్‌ జిల్లా రామాయి శివారులో ఘటన  

ఆదిలాబాద్‌ రూరల్‌: సిమెంట్‌ ఫ్యాక్టరీ ప్రారంభమయ్యే వరకు తమ భూములు తిరిగి ఇవ్వాలంటూ భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్‌ జిల్లా రూరల్‌ మండలంలోని రామాయి శివారులో గల రేణుకా సిమెంట్‌ పరిశ్రమకు సంబంధించిన స్థలం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినీరెడ్డి ఆదివాసీలతో కలిసి భూముల వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను అరెస్టు చేయడంతో మిగతావారు పోలీసుల వాహనానికి అడ్డుతగిలారు.

ఈ క్రమంలో ఓ మహిళ తమను అడ్డుకోవద్దని సీఐ కాళ్లు పట్టుకొని వేడుకుంది. అనంతరం వారందరినీ అరెస్టు చేస్తున్న క్రమంలో కొందరు మహిళలు పోలీసు వాహనంపైకి ఎక్కారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వారిని కిందకు దించి ఆదిలాబాద్‌ రూరల్, బేల, జైనథ్, భీంపూర్, తదితర స్టేషన్లకు తరలించారు. ఇంకొందరు మహిళలు పురుగుమందు డబ్బాలతో వచ్చారు. కొంతమంది రైతులు నాగలితో భూములు దున్నేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 

ఉపాధికి దూరమయ్యాం... 
సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటు కోసం 2018లో తమ పంట భూములు ఇస్తే ఇప్పటివరకు పరిశ్రమ ప్రారంభం కాలేదని, ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లలోనే పూర్తి చేస్తామని చెప్పి పరిశ్రమ యజమానులు మాట తప్పారని ఆరోపించారు. మొత్తం 107 ఎకరాల భూమి తీసుకుని ఐదేళ్లవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.

తాము ఉపాధి కరువై కూలీలుగా మారామని, కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్‌ కోసం నిరసన చేపడుతున్న క్రమంలో పోలీసులు కనీసం మహిళలని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. నిర్వాసితుల ఆందోళన నేపథ్యంలో ఈ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు