YS Avinash Reddy: అందుకే అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ వచ్చింది

31 May, 2023 11:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వివేకా హత్య కేసులో విచారణ జరుపుతున్న దర్యాప్తు సంస్థ సీబీఐ.. ఎంపీ అవినాష్‌ రెడ్డిని టార్గెట్‌ చేసిందని, ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని, కోర్టు ఆ వాదనతో ఏకీభవించి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిందని అవినాష్‌ రెడ్డి తరపు న్యాయవాదులు ‘సాక్షి’కి తెలిపారు. అంతేకాదు వివేకా కేసులో అవినాష్‌కు సంబంధం ఉన్నట్లు ఒక్క ఆధారం లేదని.. అందుకే కోర్టు ఆ తీర్పు ఇచ్చిందని అంటున్నారు.

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి బుధవారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఊరట ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఈ క్రమంలో తీర్పు అనంతరం బయటకు వచ్చిన ఆయన తరపున న్యాయవాదులు సాక్షితో మాట్లాడారు. అవినాష్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేసిన విషయాన్ని ఆయన తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి సాక్షికి వివరించారు.

‘‘సీబీఐ అవినాష్‌రెడ్డిని టార్గెట్‌ చేసిందని కోర్టుకు తెలిపాం. నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో అవినాష్‌ పేరు లేదని బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో వివేకా హత్య జరిగింది. ఆ సమయంలో సిట్ ఏర్పాటు చేసి.. వందల మందిని విచారించారు. కానీ, ఏ ఒక్కరు కూడా అవినాష్‌ రెడ్డి పేరు చెప్పలేదు. కావాలనే అవినాష్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లాం. 

ఆ వాదనతో కోర్టు ఏకీభవించి.. కస్టడీ విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. అదే సమయంలో విచారణకు సహకరించాలంటూ అవినాష్‌ రెడ్డిని కోర్టు ఆదేశించింది. ప్రతీ శనివారం అవినాష్‌ రెడ్డి సీబీఐ కార్యాలయానికి వెళ్లాలి. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలో సీబీఐ కార్యాలయానికి హాజరు కావాలని ఆ ఆదేశాల్లో పేర్కొందని వివరించారు. 

అవినాష్‌ రెడ్డికి ఈకేసుతో సంబంధం ఉందని ఒక్క ఆధారం లేదు. అందుకే ముందస్తు బెయిల్‌ ఇచ్చారు అని ఆయన తరపు న్యాయవాది నాగార్జున రెడ్డి సాక్షికి తెలిపారు. సిబిఐ చెప్పిన రాజకీయ కారణాలు కూడా సహేతుకంగా లేవని కోర్టుకు విన్నవించాం. కేవలం కక్ష సాధింపులో భాగంగా, ప్రత్యర్థులపై బురద జల్లేలా సిబిఐ చేసిన ఆరోపణలున్నాయని, పైగా అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఎల్లో మీడియాలో చేసిన ఆరోపణలనే సిబిఐ తన వాదనలుగా చేర్చిందని కోర్టుకు తెలిపామని న్యాయవాదులు వివరించారు. కేవలం హియర్ సే ఆధారంగా ఒకరిపై బురద జల్లడం సరికాదని, నిందారోపణలు చేసినంత మాత్రానా న్యాయం అందకుండా పోదన్న విషయం రుజువయిందన్నారు. 

ఇదీ చదవండి: ముందస్తు బెయిల్‌కు హైకోర్టు విధించిన షరతులు ఇవే..

మరిన్ని వార్తలు