అరే ఏంట్రా ఇది.. అలా తాగేస్తున్నారు!

20 Mar, 2021 08:46 IST|Sakshi

మద్యానికి ఫుల్‌ డిమాండ్‌

17రోజుల్లో రూ.90కోట్ల అమ్మకాలు

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారీగా విక్రయాలు

గతేడాదితో పోలిస్తే రెండు రెట్లు పెరిగిన వైనం 

కరోనా వ్యాప్తితో బీర్లపై అనాసక్తి

సాక్షి,మహబూబ్‌నగర్ : మద్యం ప్రియులు తెగ తాగేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈనెలలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బ్రాండెండ్‌ లిక్కర్‌ అత్యధికంగా అమ్ముడైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పలు పార్టీల నేతలు ఓటర్లకు విలువైన మద్యం పంపిణీ చేయడం వల్ల ఉమ్మడి జిల్లాలో చాలా మద్యం దుకాణాల్లో విలువైన బ్రాండెడ్‌ లిక్కర్‌ కొరత ఏర్పడింది. మద్యం ప్రియులు ఎక్కువగా మూడు నాలుగు బ్రాండ్‌లు వాడడం వల్ల వాటి సరఫరా బాగా పెరిగింది.

గత ఏడాది మార్చి నెలలో లిక్కర్‌ 1,39,890 కాటన్లు విక్రయించగా ఈ ఏడాది ఈనెల 1నుంచి 17వరకు 1,10,036కాటన్ల విక్రయాలు జరిగాయి. ఈ 17రోజులలో ఉమ్మడి జిల్లాలో రూ.89కోట్ల 99లక్షల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పొల్చితే ప్రస్తుతం 17 రోజుల్లో రెండింతల అమ్మకాలు పెరిగాయి. దీనికి తోడు జిల్లాలో వేసవితాపం మొదలైంది. ఎన్నడూలేనంత ఉష్ణోగ్రతలు ఈ ఏడాది నమోదవుతుండటంతో మద్యం ప్రియులు బీర్లవైపు మొగ్గు చూపుతున్నారు. లేనివిధంగా ఎండలు మండిపోవడంతో బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. 

లిక్కర్‌కు పెరిగిన గిరాకీ 
గత ఏడాది కాలంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది చల్లని బీర్లు తాగడానికి ఇష్టపడటం లేదు. సాధారణంగా మార్చి నెలలో ఎండల వేడికి బీర్లు తాగడానికి ఆసక్తి చూపేవారు కానీ ప్రస్తుతం వైరస్‌ వల్ల కొంత వెనుకడుగు వేస్తున్నారు. దీంతో బీర్ల అమ్మకాలు కొంత తగ్గాయి. ఇక లిక్కర్‌కు అయితే  ఉమ్మడి జిల్లాలో డిమాండ్‌ పెరిగింది.

సహజంగా ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మద్యం విక్రయాలు తారస్థాయిలో జరుగుతుంటాయి. గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితి సంప్రదాయంగా వస్తుంది. దీనికి కారణం కూడా వేసవి నేపథ్యంలో బీర్లవైపు ఎక్కువగా ఆసక్తి చూపుతుండటమే కారణంగా అధికారులు చెబుతున్నారు. బీర్లకు అసలైన సీజన్‌ ఏప్రిల్, మే నెలలే. ఎండలను బట్టి జూన్, జూలైలో కూడా బీర్ల అమ్మకాలు తారాస్థాయిలోనే ఉంటున్నా ఏప్రిల్, మే నెలల సింహభాగంగా డిమాండ్‌ ఉంటుంది.

ఉమ్మడి జిల్లాలో మాత్రం ఈ నెలలో లిక్కర్‌కు విపరీతమైన డిమాండ్‌ పెరిగిందని అధికారులు చెబుతున్నారు. 2020 ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో అయిన మద్యం అమ్మకాలలో మెజార్టీ బీర్ల విక్రయాలే. ఈ నెల చివరి నాటికి గతేడాది లక్ష్యాన్ని దాటి అంచనాలను మించి రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎండలు మే చివరి నాటికి అధిగమించే అవకాశం ఉండటంతో బీర్ల అమ్మకాలు పెరగవచ్చు. 

లిక్కర్‌ అమ్మకాలు పెరిగాయి 
ఉమ్మడి జిల్లాలో లిక్కర్‌ సెల్స్‌ అధికంగా ఉన్నాయి. బీర్ల అమ్మకాలు మరింత పెరగాల్సిన అవసరం ఉంది. మద్యం కొరత ఏ మాత్రం లేదు. అన్ని రకాల బీర్లు, లిక్కర్‌ మద్యం దుకాణాలలో అందుబాటులో 
ఉంది.
– విజయ్‌భాస్కర్, ఈఎస్, మహబూబ్‌నగర్‌ 

మరిన్ని వార్తలు