Hyderabad: రేస్‌ లేకుండానే ముగిసిన లీగ్‌.. ‘డ్రైవర్ల భద్రతే అన్నింటికంటే ముఖ్యం’

21 Nov, 2022 02:52 IST|Sakshi
ప్రమాదానికి గురైన డ్రైవర్‌ విష్ణు ప్రసాద్‌ను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం

అర్ధాంతరంగా ఆగడంతో ప్రేక్షకులకు నిరాశ

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌... గత కొద్ది రోజులుగా భాగ్యనగరంలో చర్చగా మారిన స్పోర్ట్స్‌ ఈవెంట్‌! శనివారమే లీగ్‌లో భాగంగా క్వాలిఫయింగ్‌తోపాటు ఒక ప్రధాన రేసు జరగాల్సి ఉన్నా... వేర్వేరు కారణాలతో అన్నింటినీ ఆదివారానికి వాయిదా వేశారు. వీకెండ్‌లో ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో అభిమానులు హుస్సేన్‌ సాగర్‌ తీరానికి తరలి వచ్చి ‘స్ట్రీట్‌ సర్క్యూట్‌’లో రేసింగ్‌ పోటీలను తిలకించేందుకు సిద్ధమయ్యారు.

అయితే అనూహ్యంగా జరిగిన ఒక ఘటన తొలి అంచెలో మూడు రేసులను ముగించింది. అప్పటికి ఇంకా క్వాలిఫయింగ్‌ రేస్‌లు ప్రారంభమే కాలేదు. ప్రాక్టీస్‌ మాత్రమే సాగుతోంది. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో చెన్నై జట్టుకు చెందిన డ్రైవర్‌ విష్ణు ప్రసాద్‌ కారు ప్రమాదానికి గురైంది. దాంతో అతడిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బ్రేక్‌ల సమస్యే ఇందుకు కారణమని తేలింది.


ఎల్‌జీబీ ఫార్ములా 4లో పోటీపడుతున్న కార్లు 

ప్రాక్టీస్‌ సమయంలో వుల్ఫ్‌ జీబీ08 థండర్స్‌ కారు బ్రేక్‌లు ఆశించిన రీతిలో సరిగా పని చేయడం లేదని అప్పటికే డ్రైవర్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాక్‌లో మలుపుల వద్ద హెవీ బ్రేకింగ్‌ జోన్‌లో అవి ప్రభావం చూపలేకపోయాయి. ప్రమాదం జరిగాక ఆ కారు­ను సర్క్యూట్‌ నుంచి తప్పించిన నిర్వాహకులు తర్జనభర్జనల అనంతరం ప్రధాన రేస్‌లను ప్రారంభించరాదని నిర్ణయించారు.‘డ్రైవర్ల భద్రతే అన్నింటికంటే ముఖ్యం. ఎఫ్‌ఎంఎస్‌సీఐ సూచ­నల మేరకు ముందు జాగ్రత్తగా రేస్‌లను రద్దు చేశాం. ఘటనపై విచారణ జరిపిస్తాం’అని ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ అధికారులు వెల్లడించారు.

దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లీగ్‌లో భాగంగా తర్వాతి రెండు అంచెలు చెన్నైలో, ఆపై చివరి అంచె డిసెంబర్‌ 10, 11లో మళ్లీ హైదరాబాద్‌లోనే జరగాల్సి ఉంది. అయితే తాజా ఘటన అనంతరం వాయిదా పడిన తొలి అంచెలోని మూడు రేస్‌లను ఎప్పుడు నిర్వహిస్తారో? మరోవైపు ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ అర్ధాంతరంగా ముగిసినా వీక్షకులకు మరో రూపంలో కాస్త ఊరట లభించింది. అదే ట్రాక్‌పై ఆదివారం సమాంతరంగా జరగాల్సిన జేకే టైర్‌ నేషనల్‌ రేసింగ్‌ చాంపియన్‌షిప్‌ (ఎల్‌జీబీ ఫార్ములా 4)ను మాత్రం విజయవంతంగా నిర్వహించారు. ఈ చాంపియన్‌షిప్‌లో భాగంగా ‘ఓపెన్‌ వీల్‌‘కార్లతో సాగిన మూడు రేస్‌లు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి.   

మరిన్ని వార్తలు