బురద నీటిలో పెళ్లి బస్సు!.. రాత్రంతా అక్కడే ఉండటంతో

22 Jun, 2022 20:38 IST|Sakshi
మోమిన్‌పేటలోని మొరంగపల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన బస్సు

సాక్షి, వికారాబాద్‌: పెళ్లి బృందాన్ని తీసుకెళ్తున్న బస్సు రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద బురద నీటిలో ఇరుక్కుపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. కోటపల్లి మండలం బర్వాద్‌ గ్రామానికి చెందిన పెళ్లి బృందం వారు హైదరాబాద్‌లోని బోరబండకు వెళ్లారు. వివాహం ముగిసిన తర్వాత తిరుగుప్రయాణంలో రాత్రి 11గంటలకు మొరంగపల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. వంతెన కింది నుంచి బస్సు తీసుకెళ్లేందుకు డ్రైవర్‌ ప్రయత్నించాడు. అప్పటికే భారీ వర్షం కువరడంతో బ్రిడ్జి కింద వరద చేరింది. బస్సు టైర్లు బురదలో కూరుకుపోవడంతో ముందుకు కదలలేదు.

దీంతో వాహనం దిగిన పెళ్లివారు నడుచుకుంటూ రోడ్డుపైకి వెళ్లారు. అక్కడి నుంచి ఆటోల్లో ఇళ్లకు చేరుకున్నారు. డ్రైవర్‌ ఎంత ప్రయత్నించినా లాభం లేకపోవడంతో బస్సును అలాగే వదిలేశాడు. తెల్లారేసరికి మరింత వర్షం కురవడం, ఊట నీరు సైతం బ్రిడ్జి కిందకు చేరడంతో సగ భాగానికి పైగా బస్సు నీటిలో మునిగిపోయింది.  ఉదయాన్నే అక్కడకు చేరుకున్న బస్సు యజమాని, డ్రైవర్, క్లీనర్, గ్రామస్తుల సాయంతో బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నించారు.   

గతేడాది సైతం ఇవే కష్టాలు 
గతేడాది వర్షాకాలంలోనూ మొరంగపల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద ఇలాంటి కష్టాలే ఎదురయ్యాయి. ఈ రూట్లో నాలుగైదు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తారు. వీరికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. కనీసం బ్రిడ్జి పనులైనా వేగంగా పూర్తిచేయడం లేదు. వంతెన కింద వరద నీరు నిల్వకుండా ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.   

కనిపించని హెచ్చరిక బోర్డులు 
వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్న చోట హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలేదు. ఈ విషయాన్ని అటు కాంట్రాక్టర్‌ ఇటు అధికారులు పట్టించుకోవడం లేదు. భారీ వర్షాలు కురిసిన సమయంలో కొత్తగా ఎవరైనా ఈ రూట్‌లో వస్తే ప్రమాదం బారిన పడక తప్పదు. గత వర్షా కాలంలో ఇక్కడే ఇరుక్కుపోయిన ఓ లారీ మూడు రోజులుగా అక్కడి ఉండిపోయింది.  

మరిన్ని వార్తలు