మేడిగడ్డ 7వ బ్లాక్‌ పూర్తిగా పునర్నిర్మించాల్సిందే..! 

4 Nov, 2023 02:58 IST|Sakshi

ఎన్‌డీఎస్‌ఏ నిపుణుల కమిటీ నివేదిక స్పష్టికరణ 

ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో నాణ్యత,నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే బ్యారేజీ కుంగింది 

ఇతర బ్లాకులూ దెబ్బతింటే బ్యారేజీ పూర్తిగా పునర్నిర్మించక తప్పదు 

ఫ్లోటింగ్‌ స్ట్రెక్చర్   డిజైన్‌ రూపొందించి రిజిడ్‌ స్ట్రక్చర్‌ పద్ధతిలో నిర్మించారు 

ఊర్ధ్వ పీడనం పునాదుల కింద ఇసుకను తన్నడంతో బ్యారేజీ కుంగింది

సాక్షి, హైదరాబాద్‌: ప్లానింగ్, డిజైన్, నిర్మాణంలో నాణ్యత, నిర్వహణ, పర్యవేక్షణ లోపాలతోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ పియర్లు కుంగాయని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ తేల్చింది. 7వ నంబర్‌ బ్లాక్‌లో తలెత్తిన తీవ్ర ప్రతికూల పరిస్థితితో బ్యారేజీ పనితీరుపై తీవ్ర దు్రష్పభావం పడిందని, ప్రస్తుత పరిస్థితిలో అది ఉపయోగానికి పనికిరాదని స్పష్టం చేసింది.

7వ నంబర్‌ బ్లాక్‌ మొత్తం పునాదులతో సహా తొలగించి పూర్తి స్థాయిలో కొత్తగా పునర్నిర్మించిన తర్వాతే బ్యారేజీ ఉపయోగంలోకి వస్తుందని తెలిపింది. ఈ సమయంలో బ్యారేజీలో నీళ్లు నింపితే పరిస్థితి మరింతగా దిగజారుతుందని హెచ్చరించింది. బ్యారేజీ నిర్మాణ సారూప్యతలను పరిగణనలోకి తీసుకుంటే ఇతర బ్లాకులూ ఇదే రీతిలో విఫలమయ్యే పరిస్థితులున్నాయని, అదే జరిగితే మొత్తం బ్యారేజీని పునర్నిర్మించక తప్పదని తెలిపింది.

మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిన ఘటనపై ఎన్డీఎస్‌ఏ సభ్యుడు, సీడబ్ల్యూసీ చీఫ్‌ ఇంజనీర్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజాగా ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌కు నివేదిక సమర్పించింది. ఈ నివేదికలోని ముఖ్యాంశాలతో ఎన్డీఎస్‌ఏ చైర్మన్‌ సంజయ్‌కుమార్‌ సిబల్‌ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌కు ఈ నెల 1న లేఖ రాశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. 

పునాది కుంగడం వల్లే.. 
ర్యాఫ్ట్‌ (పునాది) కుంగడమే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి మూలకారణం. బ్యారేజీకి 3.3 మీటర్ల లోతుతో కాంక్రీట్‌ పునాది నిర్మించారు. ర్యాఫ్ట్‌కి ముందు, వెనుక రెండువైపులా 15 మీటర్ల లోతులో సెకెంట్‌ పైల్స్‌ (కటాఫ్‌ వాల్స్‌) నిర్మించారు. ర్యాఫ్ట్‌ కుంగడంతో దానిపై నిర్మించిన పియర్లూ (బ్యారేజీ గేట్ల మధ్య పిల్లర్లుగా ఉండే కాంక్రీట్‌ నిర్మాణం) కుంగి, వాటికి పగుళ్లు ఏర్పడ్డాయి. ర్యాఫ్ట్‌ కుంగడానికి పలు కారణాలుండవచ్చు. ర్యాఫ్ట్‌ కింది ఇసుక కొట్టుకుపోవడం/ ఆ ఇసుకకు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం (బేరింగ్‌ కెపాసిటీ) లేకపోవడం/ బ్యారేజీ బరువు (లోడ్‌), ఇతర కారణాలతో ర్యాఫ్ట్‌కి ముందు భాగంలోని సెకెంట్‌ పైల్స్‌ విఫలం కావడం వంటి కారణాలు ఉండవచ్చు.  

ర్యాఫ్ట్, సెకెంట్‌ పైల్స్‌ నిర్మాణంలో నాణ్యత లోపం 
నాణ్యత పర్యవేక్షణలో వైఫల్యాలతో బ్యారేజీ కింద ర్యాఫ్ట్, సెకెంట్‌ పైల్స్‌ నిర్మాణంలో లోపాలు జరిగాయి. పక్కపక్కనే ఉండే సెకెంట్‌ పైల్స్‌ ఒకదానికి ఒకటి అతుక్కుని ఉండాలి. మధ్యలో గ్యాప్‌ ఉండకూడదు. కానీ గ్యాప్‌ ఏర్పడడంతో వాటి మధ్య నుంచి నీళ్లు పారి ర్యాఫ్ట్‌ కింద ఇసుక కొట్టుకుపోయింది.  

డిజైన్‌కు విరుద్ధంగా నిర్మాణం 
ఫ్లోటింగ్‌ స్ట్రక్చర్‌ (తేలియాడే కట్టడం)గా బ్యారేజీని డిజైన్‌ చేసి, రిజిడ్‌ స్ట్రక్చర్‌(దృఢమైన కట్టడం)గా నిర్మించారు. అంటే ఇసుక మీద బ్యారేజీ కట్టే పద్ధతుల మేరకు డిజైన్‌ రూపొందించి, దానికి భిన్నంగా రాతి మీద బ్యారేజీ నిర్మించే పద్ధతుల్లో నిర్మాణం జరిపారు. భూగర్భంలో రాయి తగిలే దాకా బ్యారేజీకి ఎగువ, దిగువన కాంక్రీట్‌ గోడలు (సెకెంట్‌ పైల్స్‌) నిర్మించారు. నీటి ప్రవాహానికి బ్యారేజీ అడ్డంకిగా ఉండడంతో ఏర్పడే ఊర్ధ్వ పీడనం (అప్‌లిఫ్ట్‌ ఫోర్స్‌) బ్యారేజీ పునాదుల కింది నుంచి నిష్క్రమించకుండా ఈ కాంక్రీట్‌ గోడలు అడ్డంకిగా మారాయి. దీంతో ఊర్ధ్వ పీడనం తీవ్రమై ర్యాఫ్ట్‌ కింద ఇసుకను బ్యారేజీ బయటికి తన్నడంతోనే ర్యాఫ్ట్‌ కుంగిపోయింది.  

బ్యారేజీతో ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ముప్పు 
బ్యారేజీ నిర్వహణ, పర్యవేక్షణలో తీవ్ర వైఫల్యం జరిగింది. నిర్మాణం పూర్తైన నాటి నుంచి ఏటా వర్షాకాలానికి ముందు, తర్వాత నిర్వహించాల్సిన సౌండింగ్‌ అండ్‌ ప్రోబింగ్‌ పరీక్షలను జరపలేదు. ఏదైన లోపాలుంటే గుర్తించడానికి వర్షాకాలానికి ముందు, తర్వాత తనిఖీలు జరపాలని తెలంగాణకు ఎన్డీఎస్‌ఏ క్రమం తప్పకుండా సూచించినా పట్టించుకోలేదు. డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ 2021లోని చాప్టర్‌ 10 సెక్షన్‌ 41(బీ) కింద దీనిని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తారు. చాలా విషయాల్లో ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్టు తెలుస్తోంది. ఇది చాలా తీవ్రమైన విషయం. బ్యారేజీతో ప్రాణాలు, ఆస్తులకు తీవ్ర ముప్పు పొంచి ఉంది.  

అడిగిన సమాచారం ఇవ్వలేదు.. 
నిపుణుల కమిటీ 20 రకాల సమాచారాన్ని కోరగా, నీటిపారుదల శాఖ 11 రకాల వివరాలను మాత్రమే అందజేసింది. ఇన్‌స్ట్రుమెంటేషన్‌ డేటా, వర్షాలకు ముందు తర్వాత బ్యారేజీ తనిఖీల సమాచారం, ప్రాజెక్టు కంప్లీషన్‌ రిపోర్టు, క్వాలిటీ కంట్రోల్‌ రిపోర్టులు, గేట్ల స్థితిగతులు తెలిపే వివరాలు.. లాంటి అనేక రకాల సమాచారాన్ని ఇవ్వలేదు. ఇవ్వడానికి వారి వద్ద ఎలాంటి సమాచారం లేదని నిపుణుల కమిటీ అభిప్రాయపడుతోంది. డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ 2021 ప్రకారం లభ్యత ఉన్న సమాచారం బ్యారేజీ అధికారులు ఇవ్వకుండా నిరాకరించడానికి ఆస్కారం లేదు.
 
సమగ్ర దర్యాప్తు జరపాలి.. 
బ్యారేజీ వైఫల్యానికి దారితీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు జరపాలి. దర్యాప్తులో తేలిన వివరాలతో పాటు బ్యారేజీ పునరుద్ధరణ ప్రతిపాదనలను ఎన్డీఎస్‌ఏకు తెలపాలి. ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో ఇదే ప్రక్రియను అనుసరించాలి.  

అన్నారం, సుందిళ్లకూ ప్రమాదమే!
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన నిర్మించిన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సైతం ఇలాంటి డిజైన్లు, నిర్మాణ పద్ధతులనే అవలంబించారు. దీంతో ఈ రెండు బ్యారేజీలు కూడా భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యాలకు గురయ్యే అవకాశాలున్నాయి. అన్నారం బ్యారేజీ గేట్లకు దిగువన నీళ్లు ఉబికిరావడం (బాయిలింగ్‌) వైఫల్యానికి ముందస్తు సూచిక లాంటిదే. బ్యారేజీల పునాదుల కింద నుంచి ఇసుక కొట్టుకుపోవడాన్ని సాంకేతిక పరిభాషలో పైపింగ్‌ అంటారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కింద పైపింగ్‌ను అత్యవసరంగా పరీక్షించాలి.   

మరిన్ని వార్తలు