కార్పొరేటర్‌ భర్త హంగామా.. కారుతో ఢీకొట్టి.. ఆపై దాడి చేసి.. 

11 Jan, 2023 13:03 IST|Sakshi
కారుతో ఢీకొట్టినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు  

సాక్షి, హైదరాబాద్‌: బైక్‌పై వెళుతున్న వారిని కార్పొరేటర్‌ భర్త కారుతో ఢీకొట్టి ఆపై దాడి చేసిన ఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్‌పేట 28వ డివిజన్‌ కార్పొరేటర్‌ జిల్లెల అరుణ భర్త ప్రభాకర్‌రెడ్డి సోమవారం రాత్రి కారులో ఇంటికి బయలుదేరాడు. అదే సమయంలో న్యూ బాలాజీనగర్‌కు చెందిన బలరామకృష్ణ మీర్‌పేట చౌరస్తా నుంచి మరో వ్యక్తి డానియల్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. శివసాయినగర్‌ కాలనీ పార్కు వద్దకు రాగానే ప్రభాకర్‌రెడ్డి తన కారుతో బలరామకృష్ణ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు.

దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడ్డారు. దీంతో బలరామకృష్ణ, ప్రభాకర్‌రెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభాకర్‌రెడ్డి.. బలరామకృష్ణపై దాడి చేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. తనపై దాడి చేసిన ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బాలరామకృష్ణ మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నన్ను, నా భార్యను బలరామకృష్ణ బూతులు తిట్టాడని ప్రభాకర్‌రెడ్డి కూడా ఫిర్యాదు చేశాడు. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు కావడం విశేషం. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసినట్లు సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.  

పరస్పర ఆరోపణలు 
తనను చంపేందుకే ప్రభాకర్‌రెడ్డి కారుతో ఢీ కొట్టాడని బాలరామకృష్ణ ఆరోపించారు. గతంలో కూడా ఇలాగే చేస్తే మంత్రి సబితారెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కాగా తనపై రాజకీయంగా బురద జల్లేందుకే బాలరామకృష్ణ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రోడ్డుకు ఎడమ వైపు కుక్క పిల్లలు ఉండడంతో వాటిని తప్పించబోయి కుడివైపు వస్తున్న బలరామకృష్ణ ద్విచక్ర వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీకొనడం జరిగిందని తెలిపారు. అంతేగానీ ఇందులో ఎలాంటి కుట్ర కోణం లేదన్నారు. కావాలనే బలరామకృష్ణ నన్ను, నా భార్యను బూతులు తిట్టాడని జిల్లెల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు