వరద  ప్రాంతాల్లో మంత్రి ఈటల రాజేందర్‌ పర్యటన

17 Aug, 2020 14:03 IST|Sakshi

సాక్షి, జమ్మికుంట: ఉత్తర తెలంగాణలో కనివిని ఎరుగని రీతిలో వర్షం కురిసిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.‌ మునుపెన్నడూ లేని విధంగా నాలుగు రోజుల్లోనే చెరువులు కుంటలు జలాశయాల నిండాయని  పలు చోట్ల చెరువులకు, కాలువలకు  గండ్లు పడి రోడ్లు దెబ్బతిని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయిని చెప్పారు. కలెక్టర్ శశాంక, జడ్పి చైర్ పర్సన్ విజయతో కలిసి మంత్రి జమ్మికుంట, హుజురాబాద్ ఏరియాలో వరదల పరిస్థితిని పరిశీలించారు. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సీఎం కేసీఆర్ మంత్రులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని తెలిపారు. (మూసీలో చిక్కుకున్న యువకులు‌) 

గ్రామాల వారిగా పంట నష్టం, దెబ్బతిన్న రోడ్లు తెగిన చెరువు కుంట కట్టలు, జలాశయాల పరిస్థితిని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించాలని అధికారులను ఆదేశించామని అందులో భాగంగా తాను హుజూరాబాద్, మానకొండూర్ నియోజకవర్గాల్లో పర్యటించినట్లు చెప్పారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పర్యటించి నష్ట అంచనాలు వేస్తున్నారు. జరిగిన నష్టాన్ని పరిశీలించి వరద తగ్గిన తర్వాత సహాయక చర్యలు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు రైతులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. (ప్రమాదకరంగా హుస్సేన్‌సాగర్‌ నాలా..)

సీఎం కేసీఆర్ వర్షం, వరదల పై ఈరోజు సమీక్ష ఏర్పాటు చేశారని తెలిపారు. పంట నష్టంపై రైతులను ఆదుకునే విషయం పై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేశామని, సీఎస్ ఆధ్వర్యంలో కంట్రోల్ సెంటర్ నడుస్తుందన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సమాచారం సేకరించి  ప్రత్యేక బృందాలు పంపిస్తున్నారని అవసరం ఉన్న చోట ప్రజలను షెల్టర్లకు తరలించి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రాబోవు 48 గంటల్లో మరోమారు తీవ్రమైన వర్షాలు ఉంటాయని హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల కోరారు.

మరిన్ని వార్తలు