విద్యుదుత్పత్తి పునరుద్ధరణకు రూ.కోటి 

27 Oct, 2020 08:21 IST|Sakshi

4 నెలల్లో 3, 5, 6వ యూనిట్లు పునరుద్ధరిస్తామని వెల్లడి  

సాక్షి, దోమలపెంట (అచ్చంపేట): టీఎస్‌ జెన్‌కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజలను విద్యుత్తు కేంద్రంలో 1, 2వ యూనిట్ల పునరుద్ధరణకు రూ.కోటిలోపే ఖర్చయిందని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్వరెడ్డి చెప్పారు. సోమవారం ఈ రెండు యూనిట్లను మంత్రి పునఃప్రారంభించారు. ఆగస్టు 20న షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో మంటలు చెలరేగి 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. యూనిట్ల పునరుద్ధరించిన అనంతరం మంత్రి జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడారు. అగ్ని ప్రమాదంతో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయిందని, దీంతో సుమారు 100 కోట్ల రూపాయల నష్టం ఏర్పడిందన్నారు. 15 నుంచి 20 రోజుల్లోనే విద్యుదుత్పత్తి చేపట్టాలనుకున్నా.. జెన్‌కో అధికారులకు కరోనా సోకడంతో ఆలస్యమైందన్నారు.

మరో నాలుగు నెలల్లోనే 3, 5, 6వ యూనిట్లను పునరుద్ధరిస్తామని తెలిపారు. 4వ యూనిట్‌ పునరుద్ధరణకు మరికొంత సమయం పడుతోందని, ఇందులోనే ఎక్కువ నష్టం జరిగిందని పేర్కొన్నారు. అంతకుముందు ఈగలపెంటలో జెన్‌కో అతిథిగృహం కృష్ణవేణి వద్ద మంత్రికి జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పూల మొక్కను ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో సందీప్‌ సుల్తానియా, జెన్‌కో హైడెల్‌ డైరెక్టర్‌ వెంకటరాజం, భూగర్భ కేంద్రం సీఈ ప్రభాకర్‌రావు, ఎస్‌ఈ సద్గుణరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఒక్కొక్కటి 150 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రస్తుతం రెండు యూనిట్ల ద్వారా 300 మెగావాట్ల  ఉత్పత్తిని చేపట్టారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా