పప్పుధాన్యాల ఉత్పత్తి తగ్గింది 

2 Oct, 2023 03:26 IST|Sakshi

పప్పుల ఉత్పత్తి పెంపునకు కృషి చేయాలి  

ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది 

రాయితీపై శనగ పప్పు పంపిణీ మంచి నిర్ణయం  

వినియోగదారులకు మేలు చేసేలా హాకా నిర్ణయం  

‘భారత్‌ దాల్‌’ఆవిష్కరణలో మంత్రి నిరంజన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో పప్పుల వినియోగం పెరిగిందని..అదే సమయంలో ఉత్పత్తి భారీగా తగ్గిపోయిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. దీంతో దేశ అవసరాలకు ఇతర దేశాల నుంచి పప్పులు దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశంలో పప్పుల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ హాకా ‘భారత్‌ దాల్‌’పేరుతో పంపిణీ చేస్తున్న రాయితీ శనగపప్పు కార్యక్రమాన్ని ఆదివారం హెచ్‌ఐసీసీలో కేంద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్‌ సింగ్‌తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ విదేశాల నుంచి కందిపప్పును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నామన్నారు. కంది పండిస్తే మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్ర భుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారత్‌దాల్‌ పేరుతో హాకా చేస్తున్న కార్యక్రమం ప్రశంసనీయమన్నారు. మధ్యతరగతి, పేద వినియోగదారులకు ఇది ఎంతో మేలు చేస్తుందన్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.90 ఉన్న శనగపప్పును రూ.60కే అందించడంపై అభినందనీయమని తెలిపారు.

కేంద్ర వినియోగదారులశాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్‌సింగ్‌ మాట్లాడుతూ రాయితీ శనగ పప్పు పంపిణీకి సంబంధించి తొలు త తమ జాబితాలో హాకా లేదన్నారు. అయితే హా కా చైర్మన్‌ మచ్చా శ్రీనివాస్‌రావు తన వద్దకు పలుమార్లు వచ్చి హాకా గొప్పతనాన్ని, తెలంగాణ ప్రభు త్వ మద్దతు వివరించారని తెలిపారు. ఒక అవకాశం ఇచ్చి చూద్దామని హాకాకు శనగల పంపిణీ బాధ్యత అప్పగించామన్నారు. హాకా పనితీరు, ఏర్పాట్లు చూశాకా మరింత నమ్మకం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాకా చైర్మన్‌ మచ్చా శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, హా కా ఎండీ సురేందర్, జీఎం రాజ మోహన్, ఆగ్రోస్‌ ఎండి కె.రాములు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు