మహిళా జర్నలిస్టుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తాం

24 Apr, 2022 03:21 IST|Sakshi
మహిళా జర్నలిస్టులతో మంత్రులు సత్యవతి, సబిత, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీత, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ 

మహిళా జర్నలిస్టుల వర్క్‌షాప్‌ ప్రారంభోత్సవంలో మంత్రులు సబిత, సత్యవతి వెల్లడి 

సనత్‌నగర్‌: జర్నలిజాన్ని సవాల్‌గా స్వీకరించి వృత్తిలో రాణిస్తున్న మహిళా జర్నలిస్టుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. తాను ఎక్కడికెళ్లినా జర్నలిస్టుల పిల్లల ఉచిత విద్యపై వినతులు వస్తున్నాయని, ఈ విషయంపై యూనియన్లు ప్రతిసారీ డీఈవోల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సీఎంతో చర్చించి శాశ్వత పరిష్కారం జరిగేలా చూస్తానని తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో రెండు రోజుల పాటు జరిగే మహిళా జర్నలిస్టుల వర్క్‌షాప్‌ శనివారం ప్రారంభమైంది.

మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సబిత మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాక ఒక్కొక్క రంగంలోని సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించుకుంటూ వెళ్తున్న క్రమంలో మీడియా రంగంలో పనిచేస్తున్న వారి సమస్యల పరిష్కారానికి మీడియా అకాడమీ ప్రత్యేక చొరవ తీసుకోవడం అభినందనీయమన్నారు.

సత్యవతి మాట్లాడుతూ..  మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి తమ శాఖ నుంచి రూ.5 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మహిళలకు ఏవైనా సమస్యలుంటే ఉమెన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకురావాలని సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. కార్యక్రమంలో సీనియర్‌ మహిళా జర్నలిస్టులు సుమబాల, స్వేచ్ఛ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నేత మారుతీసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు