విద్యుత్‌ సంస్కరణలతో రైతులపై భారం 

29 Aug, 2021 03:09 IST|Sakshi
చిట్యాలలో రైతు సత్తిరెడ్డితో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి  

శాలిగౌరారం/ మోత్కూరు/చిట్యాల/ నార్కట్‌పల్లి: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యుత్‌ సంస్కరణలు రైతులకు భారంగా మారనున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో ఒప్పంద వ్యవసాయవిధానం అమలుకు అవకాశం కల్పించిందని, రైతులు కార్పొరేట్‌ వ్యవస్థలోకి వెళ్లనున్నారని దీంతో వ్యవసాయ మార్కెట్లు నిర్వీర్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి ఆయన శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. మోత్కూరు మార్కెట్‌ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు కూడా దమ్ముంటే అటువంటి పథకాలు అమలు చేయాలని సవాలు విసిరారు. రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ అధీనంలోని 6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలుతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రాన్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు యాత్రలు చేస్తున్నాయని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. శాలిగౌరారం వెళ్తూ మార్గమధ్యంలో చిట్యాలలో రైతు కొంతం సత్తిరెడ్డి వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలించి అక్కడ పండించిన వంకాయలను మంత్రి కొనుగోలు చేశారు. నార్కట్‌పల్లిలోని ఓ ఎడ్ల బండిని చూసి.. చాలా రోజుల తర్వాత చూస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు.

మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు 
చర్ల: మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలు, పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్‌ రక్షణదళ గార్డు ముసికి బుద్రి అలియాస్‌ బీఆర్‌ శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏఎస్పీ డాక్టర్‌ వినీత్‌ ఎదుట లొంగిపోయింది. ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా రాంపురంవాసి, గొత్తికోయ తెగకు చెందిన ముసికి బుద్రి ఆరేళ్లుగా పార్టీలో పని చేస్తోంది. ఆమె భర్త ముసికి సోమడాల్‌ అలియాస్‌ సోమనార్‌ కూడా ఊసూరు ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు నెలల వయసు ఉన్న బాబు ఉన్నాడు. కొంతకాలంగా రక్తహీనతతో బాధపడుతుండడంతో బుద్రి పోలీసులకు లొంగిపోయింది.   

మరిన్ని వార్తలు