అచ్చం రక్తంలాగే ఉండే బీట్‌రూట్‌ జ్యూస్‌.. తాగాయంటే దోమలు ఖతం

19 Oct, 2021 20:00 IST|Sakshi

మనుషులకు అతిపెద్ద శత్రువులు దోమలే. రకరకాల వ్యాధులను వ్యాపింపజేస్తూ లక్షలాది మంది మరణాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి దోమలను నిర్మూలించడంపై దృష్టిపెట్టిన శాస్త్రవేత్తలు.. బీట్‌రూట్‌ జ్యూస్‌ ఆధారంగా రక్తంకాని రక్తాన్ని సృష్టించారు. అందులో విషపూరిత పదార్థాలను కలిపి దోమలను హతమార్చే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా? 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

కీటకనాశనుల ప్రమాదం నుంచి..
ప్రస్తుతం మనం దోమలను హతమార్చేందుకు మస్కిటో రిపెల్లెంట్లు, రసాయనాలు కలిపిన అగరుబత్తులు వంటి వాటిని వినియోగిస్తున్నాం. వాటిలో విషపూరిత పదార్థాలు దోమలను చంపడమో, మనుషులను కుట్టే సామర్థ్యాన్ని దెబ్బతీయడమో చేస్తాయి. కానీ ఆ రసాయనాలు మనుషులకు కూడా హానికరమేనని వైద్యులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే.. స్వీడన్‌కు చెందిన ‘మాలిక్యులర్‌ అట్రాక్షన్‌’స్టార్టప్‌ శాస్త్రవేత్తలు.. మనుషులకు హానికలగకుండా దోమలను ఆకర్షించి చంపే విధానాన్ని అభివృద్ధి చేశారు. 
చదవండి: ఆడ దోమలే ఎందుకు కుడతాయి.. వాళ్లను ప్రేమిస్తాయి!

‘మలేరియా’వాసనతో.. 

మలేరియా వ్యాధి సోకినవారి నుంచి ఒక రకమైన వాసన వస్తుంటుంది. మలేరియాకు కారణమైన ప్లాస్మోడియం పరాన్నజీవులు.. మన రక్తంలోని ఎర్రరక్త కణాలను ఆక్రమించి, విచ్ఛిన్నం చేసినప్పుడు వెలువడే ‘హెచ్‌ఎంబీపీపీ’అనే రసాయనమే దీనికి కారణం. దోమలు ఈ వాసనకు విపరీతంగా ఆకర్షితమవుతాయి. దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ‘హెచ్‌ఎంబీపీపీ’మాలిక్యూల్స్‌తోనే దోమలకు చెక్‌పెట్టవచ్చని తేల్చారు. 
చదవండి: సైలెంట్‌ అయిపోయిన డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్‌

బీట్‌రూట్‌ జ్యూస్‌లో కలిపి.. 
అచ్చం రక్తం లక్షణాలను పోలి ఉండేలా.. అంతే సాంద్రత, రంగుతో బీట్‌రూట్‌ జ్యూస్‌ను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. దానిలో దోమలను ఆకర్షించే ‘హెచ్‌ఎంబీపీపీ’మాలిక్యూల్స్‌ను, మొక్కల ఆధారిత విష పదార్థాలను కలిపారు. దీనిని దోమలు ఉన్న చోట పెట్టారు. హెచ్‌ఎంబీపీపీ వాసనకు ఆకర్షితమైన దోమలు రక్తంకాని రక్తాన్ని పీల్చుకున్నాయి.

విషపదార్థం ప్రభావంతో కాసేపటికే అన్నీ చనిపోయాయి. అయితే మలేరియాను వ్యాప్తి చేసే అనాఫిలిస్‌ రకం దోమలు ఎక్కువగా ఆకర్షితమయ్యాయని.. వివిధ మాలిక్యూల్స్‌ను ఉపయోగించడం ద్వారా ఇతర వ్యాధులను వ్యాప్తిచేసే దోమలనూ చంపవచ్చని మాలిక్యులర్‌ అట్రాక్షన్‌ సంస్థ ప్రకటించింది. ఈ పరిశోధన వివరాలు ఇటీవలే కమ్యూనికేషన్‌ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. 

మనుషులకు హానికలగకుండా.. 
‘‘దోమల నిర్మూలన కోసం వినియోగించే రసాయనాలను గాలిలో స్ప్రే చేయడమో, రిపెల్లెంట్‌ పరికరాలతో ఆవిరిగా మార్చడమో చేస్తుంటారు. వాటిని మనం కూడా పీల్చుకుంటుంటాం. ఆ విష పదార్థాలు మన శరీరంలో చేరి దుష్ప్రభావాలు కలిగిస్తాయి. అదే మేం రూపొందించిన పద్ధతిలో దోమలు వాటంతట అవే వచ్చి విషపూరిత పదార్థాన్ని పీల్చుకుని చనిపోతాయి. మనుషులకు ఎటువంటి హానీ ఉండదు. పైగా ఖర్చుకూడా తక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కాపాడొచ్చు..’’అని మాలిక్యులర్‌ అట్రాక్షన్‌ సంస్థ సీఈవో లెచ్‌ ఇగ్నటోవిజ్‌ వెల్లడించారు. 

దోమలకు బ్యాక్టీరియా ఎక్కించి.. 
దోమల నియంత్రణకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో డెంగీకి కారణమయ్యే దోమల నియంత్రణపై ఇండోనేషియాలో చేసిన ప్ర యోగం దాదాపు విజయవంతమైంది. శాస్త్రవేత్తలు దోమల్లో డెంగీ వైరస్‌ను వ్యాప్తిచేసే సామర్థ్యాన్ని దెబ్బతీసే ‘వొల్బాచియా’ బ్యాక్టీరియాను ఎక్కించారు. ఈ దోమలను పలు ప్రాంతాల్లో వదిలారు. ఆ బ్యాక్టీరియా ఇతర దోమలకూ వ్యాపించి.. డెంగీ కేసులు తగ్గాయి.   

మరిన్ని వార్తలు