రైతు ఉద్యమానికి కేసీఆర్‌ మద్దతు ఇవ్వాలి

7 Aug, 2021 01:12 IST|Sakshi

జంతర్‌మంతర్‌ వద్ద కిసాన్‌ సంసద్‌లో రేవంత్‌ రెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయకుండా తెలంగాణ సీఎం కేసీఆర్‌ రైతు ద్రోహిగా మిగిలారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో రైతులు 8 నెలలుగా ఆందోళన చేస్తుంటే టీఆర్‌ఎస్‌ ఎంపీలు కనీసం రైతులకు సంఘీభావం తెలపలేదని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలోని కిసాన్‌ సంసద్‌ కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ సహా 15 విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. రైతుల ధర్నాకు కేసీఆర్‌ ప్రత్యక్షంగా మద్దతు తెలపాలని డిమాండ్‌ చేశారు. ఏ విషయంలో అయినా కేసీఆర్, ప్రధాని మోదీ నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా మోదీ తెస్తున్న చట్టాలకు కేసీఆర్‌ మద్దతు పలుకుతూ, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.  

అసెంబ్లీలో తీర్మానం చేయాలి
కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే, వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తుందని రేవంత్‌రెడ్డి చెప్పారు. వ్యవసాయ చట్టాలను చేసి కేంద్రం రైతులను మోసం చేసినప్పటికీ, తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి వాటిని అమలు చేయాల్సిన అవసరం లేదని రేవంత్‌ అన్నారు. వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ఏక వాక్య తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు