అవినీతికి పడగలెత్తిన నాగరాజు

16 Aug, 2020 07:13 IST|Sakshi

సాక్షి, మేడ్చల్‌ జిల్లా : అక్రమాలతో కోట్లకు పడగలెత్తిన తహసీల్దార్‌ నాగరాజుది ఆది నుంచీ అవినీతి చరిత్రేనని తెలుస్తోంది. రెవెన్యూ శాఖలో 15 ఏళ్లుగా టైపిస్టు నుంచి ఆర్‌ఐ, డీటీ, తహసీల్దార్‌ వరకు పనిచేసిన ప్రతి స్థాయిలో ఆయన ‘చేతివాటం’ చూపించాడని రెవెన్యూ వర్గాల సమాచారం. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రాంపల్లిదాయర రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వేనంబర్‌ 604 నుంచి 614 వరకు గల కోర్ట్‌ ఆఫ్‌ వార్డ్స్‌ (గవర్నమెంట్‌ కస్టోడియన్‌ ల్యాండ్‌) 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధించి ఓ వర్గానికి అనుకూలంగా రెవెన్యూ రికార్డులో పేర్ల నమోదుతోపాటు, పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు తహసీల్దార్‌ నాగరాజు రియల్‌ బ్రోకర్‌ కందాడి అంజిరెడ్డి ఇంట్లో రూ.1.10 కోట్ల నగదు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం తేల్సిందే.

నాగరాజు.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్‌ , ఘట్‌కేసర్, హయత్‌నగర్, శామీర్‌పేట, కూకట్‌పల్లి, కీసర మండలాల్లో టైపిస్టుగా, ఆర్‌ఐ, డీటీ, తహసీల్దార్‌గా పనిచేశారు. దాదాపు రెండేళ్లు కీసరలో పనిచేసిన సందర్భంలో ఆయన అవినీతిపై ఆరోపణలు అంతులేకుం డా ఉన్నాయి. కీసర, కీసర దాయర, చీర్యాల, భోగారం, అంకిరెడ్డిపల్లి, తిమ్మాయిపల్లి, రాంపల్లిదాయర గ్రామాలతోపాటు నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో మట్టి నుంచి మొదలుకుని రికార్డుల ప్రక్షాళన, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, రైతుబంధు వరకు దేన్ని వదలకుండా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నది.

రియల్‌ వెంచర్లు, ప్లాట్లుగా మారిన భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేసి రైతుబంధు వచ్చేలా చేశారనే ఆరోపణలున్నాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధి అహ్మద్‌గూడలోని అసైన్డ్‌ భూముల్లో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఒక్కో ఇంటి యాజమాని వద్ద నుంచి అప్పటి మహిళా వీఆర్‌ఓ, వీఆర్‌ఏ సాయంతో రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. 2011లో శామీర్‌పేట మండలంలో డీటీగా పనిచేసినపుడు వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటిపై ఏసీబీ అధికారులు దాడిచేసి జైలుకు పంపారు. 

25 ఏళ్లుగా ఆ భూముల వివాదం..
ప్రస్తుతం నాగరాజు పట్టుబడటానికి కారణమైన రాంపల్లిదాయర రెవెన్యూ పరిధిలోని 53 ఎకరాల భూములకు సంబంధించి షరీఫ్, గాలిజంగ్‌ తదితర 20 మంది కుటుంబసభ్యులకు, రాంపల్లి దాయర గ్రామానికి చెందిన వేల్పుల ఆంజనేయులు, నర్సింగ్‌రావు, శ్రీనివాస్‌ మరో 25 మంది కుటుంబాల మధ్య 25 ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఈ సర్వేనంబర్లలోని 53 ఎకరాల భూముల్లోని 28 ఎకరాలకు సంబంధిం చి ఇరువర్గాల మధ్య భూవివాదంపై హైకోర్టు స్థాయిలో విచారణ కొనసాగుతుండగా, మిగతా భూములకు సంబంధించి కొందరికి ఓఆర్‌సీలు అందజేసినట్లు తెలుస్తోంది. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న రియల్టర్‌ బ్రోకర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్‌ తదితరులు భూమార్పిడి, పట్టాదారు పాసు పుస్తకాల జారీకి కీసర తహసీల్దార్‌ నాగరాజుతో రూ.2 కోట్లకు డీల్‌ కుదుర్చుకున్నటు తెలుస్తున్నది. 

కూకట్‌పల్లిలోనూ అదేతీరు..
కూకట్‌పల్లి తహసీల్దార్‌గా 2017 జూన్‌ 20న బాధ్యతలు చేపట్టిన నాగరాజు ఏడాది పాటు ఇక్కడ పనిచేశారు. ఇక్కడి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యేందుకు సహకరించారనే ఫిర్యాదులు వచ్చాయి. సర్వే నంబర్‌ 91లో చిత్తారమ్మ ఆలయానికి చెందిన భూమిని సర్వే నంబర్‌ 90 పేరుతో కబ్జాదారులకు రిజిస్ట్రేషన్‌ చేయటం వివాదాస్పదమైం ది. కూకట్‌పల్లిలో సర్వే నంబర్‌ 1007 హైటెక్‌ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న సుమారు 340 ఎకరాల భూమిలో ఓ నిర్మాణ సంస్థకు అనుకూలంగా మ్యుటేషన్‌ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుని నోటీసులు జారీ చేయటం సైతం అప్పట్లో వివాదాస్పదమైంది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు