సగం మంది టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు 

5 Nov, 2022 02:12 IST|Sakshi

మునుగోడులో బీజేపీకి 31–35 శాతం ఓట్లు 

ఆరా, థర్డ్‌ విజన్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల్లో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో వివిధ పార్టీలు సాధించే ఓట్ల శాతంపై నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ (పోస్ట్‌ పోల్‌) ఫలితాలను శుక్రవారం కొన్ని సంస్థలు ప్రకటించాయి. ఆరా, థర్డ్‌ విజన్‌ రీసెర్చ్‌ అండ్‌ సర్వీసెస్‌ సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాలను ప్రకటించాయి. పోలైన ఓట్లలో టీఆర్‌ఎస్‌ 50శాతానికి అటూ ఇటూగా సాధించి పార్టీ అభ్యర్థి గెలుపొందుతారని అంచనా వేశాయి.

బీజేపీ 31–35 శాతం ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలుస్తుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ‘ఆరా’సంస్థ లెక్కల ప్రకారం ఆదివారం 298 బూత్‌లకు సంబంధించి 22 రౌండ్ల పాటు జరిగే ఓట్ల లెక్కింపులో కేవలం ఒక రౌండ్‌లో మాత్రమే బీజేపీ ఆధిక్యత చూపనుంది. ఐదు రౌండ్లలో టీఆర్‌ఎస్, బీజేపీ నడుమ నువ్వా నేనా అనే రీతిలో పోరు ఉంటుందని, మిగతా అన్ని రౌండ్లలో టీఆర్‌ఎస్‌కు ఆధిక్యత వస్తుందని ‘ఆరా’అంచనా వేసింది. 18 నుంచి 25ఏళ్ల యువత టీఆర్‌ఎస్, బీజేపీ పట్ల సమాన స్థాయిలో మొగ్గు చూపగా, మిగతా వయసుల వారు టీఆర్‌ఎస్‌పై మొగ్గుచూపినట్లు సర్వే ఫలితాలు వెల్లడించాయి.  

మరిన్ని వార్తలు