‘సాక్షి’ రిపోర్టర్‌పై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరుల హత్యాయత్నం

17 Jan, 2022 01:53 IST|Sakshi

దాడికి పాల్పడిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరులు

నిజామాబాద్‌ జిల్లాలో ఘటన

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌ మండల సాక్షి రిపోర్టర్‌ కమలాపురం పోశెట్టిపై ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అనుచరులు హత్యాయత్నం చేశారు. శనివారం మండలంలోని కొత్తపల్లిలో జెడ్పీ చైర్మన్‌ విఠల్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతుబంధు సంబురాల కార్యక్రమం కవరేజ్‌ నిమిత్తం ఆయన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, వల్లభాపూర్‌ గ్రామ సమీపంలో రెండు బైక్‌లపై, మంకీ క్యాప్‌లు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు ఇనుప రాడ్లతో దాడి చేశారు.

సమీపంలోని పొలాల్లో నాట్లు వేస్తున్న కూలీలు పరుగున రావడంతో దుండగులు పారిపోయారు. తీవ్రంగా గాయపడిన పోశెట్టిని నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. మాక్లూర్‌ సొసైటీలో చోటుచేసుకున్న రూ.30 లక్షల అక్రమాలపై పోశెట్టి ఇటీవల వార్తలు రాశారు. అలాగే, గత శుక్రవారం మెట్‌పల్లిలో జరిగిన రైతుబంధు ఉత్సవాల్లో విఠల్‌రావు మాట్లాడుతూ.. సోయిలేని ప్రజాప్రతినిధి అంటూ ఎమ్మెల్యే గురించి వ్యాఖ్యలు చేశారు.

ఈ వార్త రాయడంతోపాటు గతంలో సొసైటీలో అక్రమాల గురించి రాసినందుకు మాక్లూర్‌ సొసైటీ చైర్మన్‌ కొడుకు గోపు రంజిత్, నందిపేట మండలం లక్కంపల్లి సర్పంచ్‌ భర్త మహేందర్‌ సూత్రధారులుగా ఈ హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోశెట్టి ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ఖబడ్దార్‌ జీవన్‌రెడ్డి: విరాహత్‌ 
రిపోర్టర్‌పై హత్యాయత్నాన్ని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అరాచకాల చిట్టాను వెలికితీస్తామంటూ ఖబడ్దార్‌ అని హెచ్చరించారు.

క్షమించరాని నేరం: ప్రవీణ్‌కుమార్‌ (బీఎస్పీ)
పోశెట్టిపై హత్యాయత్నాన్ని బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఖండించారు. అక్రమాలను వెలుగులోకి తెచ్చిన గిరిజన విలేకరిపై దాడి చేయడం క్షమించరాని నేరమన్నారు. 

మరిన్ని వార్తలు