‘174 మంది బాలికలకు ఒకటే’.. సాక్షి కథనానికి విశేష స్పందన

10 Dec, 2021 15:07 IST|Sakshi

పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ముందుకు వచ్చిన సంస్థలు, దాతలు

‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు

పెద్దవూర/ఆదిలాబాద్‌ టౌన్‌: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మూత్రశాలల కొరతతో బాలికలు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ మెయిన్‌లో గురువారం ‘174 మంది బాలికలకు ఒకటే’ శీర్షికన ప్రచురితమైన కథనానికి పలువురు దాతలు స్పందించారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు పాఠశాలలో మూత్రశాలలతో పాటు మౌలిక వసతులు కల్పించడానికి ముందుకు వచ్చారు. (174 మంది బాలికలకు ఒకటే.. అరగంట ముందు నుంచే విరామం)

హైదరాబాద్‌ మాదా పూర్‌కు చెందిన ఎన్‌సీసీ లిమిటెడ్‌ యాజమాన్యం విద్యార్థులకు కావాల్సిన మూత్రశాలలు నిర్మించటానికి ముందుకు వచ్చింది. తమ ప్రతినిధులను పాఠశాలకు పంపి.. ఎన్ని మూత్రశాలలు అవసరమవుతాయో ప్రతిపాదనలు తయారు చేసి త్వరలో నిర్మించి ఇస్తామని తెలియజేసింది. ‘సాక్షి’దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిం చి దాతలు, స్వచ్ఛంద సేవాసంస్థలు ముందు కు రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.

♦ కస్తూరి ఫౌండేషన్‌ చైర్మన్‌ కస్తూరి శ్రీచరణ్‌ పాఠశాలలో రెడీమేడ్‌ మూత్రశాలను నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్‌ రామారావు తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా పాఠశాలకు పది మరుగుదొడ్లు నిర్మించి ఇస్తామని, తమ ప్రతినిధులు పాఠశాలను సందర్శించి మౌలిక వసతులు కల్పిస్తామని హామీనిచ్చారు.

‘సాక్షి’లో వచ్చిన విద్యార్థినుల ఇబ్బందుల వార్త తనను కదిలించిందని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ వైద్య కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కళ్లెం వెంకట్‌రెడ్డి తెలిపారు. రెండో మూత్రశాల మరమ్మతులకు తనవంతుగా రూ.10 వేల ఆర్థిక సహాయం చేస్తున్నట్టు ప్రకటించారు.

♦ ఇంకా, సికింద్రాబాద్‌కు చెందిన రోటరీ క్లబ్‌ సైతం పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపింది. పోలీస్‌ శాఖలో సీఐగా పనిచేస్తున్న నులక వేణుగోపాల్‌రెడ్డి సైతం పాఠశాలలో అవసరమైన మూత్రశాలలు నిర్మించటానికి ముందుకు వచ్చారు. హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్‌ గండికోట శ్రీనివాస్‌ తమవంతు సహాయం చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ సేవా సమితి సభ్యులు కూడా ఆర్థిక సహాయం అందించటానికి ముందుకు వచ్చారు. 

మరిన్ని వార్తలు