త్వరలో డిగ్రీ ప్రవేశాల నోటిఫికేషన్‌ 

14 Jun, 2021 01:25 IST|Sakshi

ఈ నెల 26లోగా వెలువడనున్న ఇంటర్‌ ఫలితాలు

ఆ వెంటనే నోటిఫికేషన్‌ జారీకి ‘దోస్త్‌’ కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) కసరత్తు చేస్తోంది. దోస్త్‌ పరిధిలోని 1,046 డిగ్రీ కాలేజీల్లో 4,12,805 సీట్లు ఉండగా ఇంటర్‌ ఫలితాలు వెలువడిన వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాలను ఈ నెల 26లోగా విడుదల చేసేలా బోర్డు చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌లో మార్కుల కాపీ డౌన్‌లోడ్‌ చేసుకున్నపుడే డిగ్రీలో ప్రవేశాలను ఎలా పొందాలన్న వివరాలతో ‘గ్రీటింగ్స్‌’పంపనుంది. ఆ వెంటనే ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ మొదలయ్యేలా ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ను సిద్ధం చేస్తోంది.

డిగ్రీ, పీజీ కాలేజీల్లో అదనపు సెక్షన్లు, ఆయా కాలేజీల్లో లేని కొత్త కోర్సులు, కొత్త కాంబినేషన్లకు అనుమతి ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. గతేడాది కాలేజీలకు మంజూరైన సీట్లలో 60% సీట్లు నిండిన కాలేజీలకే గరిష్టంగా మూడు కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వాలన్న షరతు విధించింది. ఒక్కో కాలేజీలో బీఏ, బీకాం, బీఎస్సీలో కలిపి గరిష్టంగా 12 కాంబినేషన్లకు అనుమతి ఇస్తారు. ఒక్కో కాంబినేషన్‌లో 3 సెక్షన్ల వరకే అనుమతి రానుంది. యాజమాన్యాలు అదనపు సెక్షన్లు, మీడియం మార్పు, కోర్సుల రద్దుకు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు