కన్న ఒడి.. కన్నీటి తడి!

28 May, 2021 14:32 IST|Sakshi

ఫుట్‌ఫాత్‌ మీద బతుకీడుస్తున్న వృద్ధులు

సాక్షి, హైదరాబాద్‌: జీవన సంధ్యాసమయంలో పేగు బంధం తల్లడిల్లలేదు. వృద్ధాప్యంలో ఒంటరి బతుక్కు ఊతమవ్వలేదు. చిన్నప్పుడు చంటి పాపలను కంటిపాపలుగా చూసిన ఆ కళ్లు చెమ్మగిల్లితే తుడవనూలేదు. చేయి పట్టి నడిపించిన ఆ చేతులను చేరదీయలేదు. బుక్కెడు బువ్వ పెట్టి కడుపు నింపేవారే దూరంగా వెళ్లిపోయారు. బిడ్డలను నమ్ముకున్న ఆ తల్లులకు చివరికి కన్నీరే మిగిల్చారు. రెక్కలొచ్చి ఎక్కడికో వెళ్లిపోయారు. రెక్కలు అలసి ఆ మాతృమూర్తులు ఒంటరి వారయ్యారు. నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్డునంబర్‌– 10లోని ఫుట్‌పాతే ఇద్దరు అమ్మలకు ఆశ్రయంగా మారిన వ్యథార్థ జీవన యథార్థ గాథ ఇది. 

బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి వద్ద కేబీఆర్‌ పార్కును ఆనుకొని ఉన్న ఫుట్‌పాత్‌పై ఇద్దరు ‘అమ్మ’లు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ కష్టాల పాలవుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తి సమీపంలోని దొడుకొండపల్లికి చెందిన కాశమ్మ (60)కు ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. ఆమె కుటుంబం 25 ఏళ్ల క్రితమే బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చింది. కూలిపనులు చేస్తుండేవారు. కొన్నేళ్ల కిందట కాశమ్మ భర్త చనిపోయరు. కుమారులు, కుమార్తెకు వివాహాలయ్యాయి. వేర్వేరుగా బతుకున్నారు. ఈ క్రమంలో గత ఏడాది మొదటి దశ కరోనా సమయంలోనే పనులు లేక తలోదారి పట్టారు. కొడుకులిద్దరూ తల్లిని వదిలేసి వెళ్లిపోయా రు. కాశమ్మ ఒంటరిదైంది. కూతురు కూడా చూసే పరిస్థితి లేదు. ఒంటరిగా మారిన కాశమ్మ ఫుట్‌పాత్‌నే ఆశ్రయంగా చేసుకుంది. దారిన పోయేవారు ఇంత తిండిపెడితే కడుపు నింపుకొంటోంది.   

వెంకమ్మది మరో దీనగాథ..  
నెల్లూరు జిల్లా మొల్కురుకు చెందిన వెంకమ్మ (60)కి ఓ కుమారుడున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్డు నం.10లోని సింగాడికుంటలో ఉంటున్నాడు. కరోనా కష్టకాలంలో కొడుకును చూద్దామని వెంకమ్మ నగరానికి ఇటీవల వచ్చింది. తమకే కడుపుకింత తిండిలేక సతమతమవుతున్నామని నువ్వు మాకు భారమంటూ కొడుకు ముఖం మీదే చెప్పి పంపించాడు. వెళ్లడానికి దారి ఖర్చులు లేకపోవడంతో బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి వద్ద అన్నం పెడుతున్నారంటే వచ్చింది. ఇక ఇక్కడే ఆశ్రయం ఏర్పాటు చేసుకుంది. కాశమ్మతో పాటు తనూ ఉంటోంది. తమ కష్టాలు పంచుకుంటున్నారు. కాగా.. బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి వద్ద ఫుట్‌పాత్‌పై సుమారు 150 మంది వరకు నిరాశ్రయులు నానా కష్టాలు పడుతున్నారు. ఎవరైనా ఇంత తిండిపెడితేనే వీరి కడుపు నింపుకొంటున్నారు. 

ఆదుకోని నైట్‌షెల్లర్లు
జీహెచ్‌ఎంసీ సర్కిల్‌– 18 పరిధి కిందకు వచ్చే ఈ ప్రాంతంలో నిత్యం వందలాది మంది ఫుట్‌పాత్‌లపై ఆశ్రయం పొందుతున్నారు. రాత్రిపూట వీటిపైనే నిద్రిస్తున్నారు. ఎవరైనా ఇంత అన్నం పెడితే తింటూ కాలం గడుపుతున్నారు. కనీసం వృద్ధులనైనా నైట్‌ షెల్టర్లలోకి చేర్చాల్సిన బాధ్యతను అధికారులు మర్చిపోయారు.
– బంజారాహిల్స్‌ 

 

మరిన్ని వార్తలు