పదేళ్లుగా గప్‌చుప్‌ వ్యాపారం.. రూ.20 లక్షలకు పైగా అప్పులు చేసి..

2 Aug, 2021 15:58 IST|Sakshi
బాధిత మహిళ

సాక్షి, మరికల్‌ (మహబూబ్‌నగర్‌): రోడ్డుపై గప్‌చుప్‌ల వ్యాపారం చేస్తూ జీవనం ఓ వ్యాపారి ఏకంగా రూ.20 లక్షల అప్పు చేసి ఉడాయించాడు. ఈ సంఘటన పది రోజుల తర్వాత వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ సమీపంలోని వడెగామ్‌తండాకు చెందిన రాజారాం పదేళ్ల క్రితం నారాయణపేట జిల్లా మరికల్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఇక్కడే పోలీస్‌స్టేషన్‌ పక్కన గప్‌చుప్‌ల వ్యాపారం నడిపిస్తున్నాడు. ప్రైవేట్‌ ఫైనాన్స్‌లో, తెలిసిన వ్యక్తుల వద్ద చిట్టీలు వేస్తూ చేసి అప్పులు తీరుస్తూ అందరినీ నమ్మించాడు.

ఆ తర్వాత స్థానికంగా ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. అంతేగాక వ్యాపారానికి, ఇంటికి కావాల్సిన సరుకులను కిరాణా దుకాణాల్లో తీసుకుని రూ.లక్షల్లో బాకీ పడ్డాడు. మూడు నెలల క్రితం ఇంటిని మరొకరికి విక్రయించి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సుమారు పది మంది వద్ద రూ.20 లక్షలకు పైగా అప్పులు చేసి పది రోజుల క్రితం రాత్రికి రాత్రే ఉడాయించాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు స్వగ్రామానికి వెళ్లినా ప్రయోజనం దక్కలేదు. చివరకు అక్కడా అతను లేకపోవడంతో మోసపోయాయని వారు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై ఎస్‌ఐ నాసర్‌ను వివరణ కోరగా తమకు బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.  

దాటవేస్తూ వచ్చాడు..  
ఏడాది క్రితం కూతురి పెళ్లి కోసం జమ చేసిన రూ.లక్షను అప్పుగా అడిగితే గప్‌చుప్‌ల వ్యాపారికి ఇచ్చా. తిరిగి అడితే ప్రతిసారి ఇస్తానంటూ మాట దాటవేస్తూ వచ్చాడు. పది రోజుల క్రితం అతను ఉండే ఇంటికి వెళ్లి చూశాం. అప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి ఎటో వెళ్లిపోయాడు. ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తి తనకు అమ్మాడని చెప్పడంతో మోసపోయామని గుర్తించాం. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. 

– దాసరి అంజమ్మ, బాధితురాలు, మరికల్‌ 
 
  

మరిన్ని వార్తలు