ఆకాశవీధిలో అదిరే ఫీట్లు

14 Jan, 2021 05:29 IST|Sakshi
ఆకాశంలో పారా మోటార్‌ పైలట్ల విన్యాసాలు

పాలమూరులో పారామోటార్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు 

ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌  

మహబూబ్‌నగర్‌ క్రీడలు: సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న జాతీయ పారామోటార్‌ చాంపియన్షిప్‌–2021 పోటీలు బుధవారం మహబూబ్‌నగర్‌లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ పర్యాటక శాఖ, వర్జికల్‌ వరల్డ్‌ అడ్వెంచర్స్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీలను జిల్లా ప్రధాన స్టేడియంలో ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో జిల్లాలో పారామోటార్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ‘కర్వెన–ఉద్దండాపూర్‌ రిజర్వాయర్ల మధ్య 15 ఎకరాల్లో ఈ ట్రైనింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం.

తెలంగాణ నుంచే పారామోటార్‌ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను తీర్చిదిద్దుతాం. భవిష్యత్‌లో కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులో అంతర్జాతీయ పారామోటార్‌ చాంపియన్షిప్‌ పోటీలు నిర్వహిస్తాం. హైదరాబాద్‌కు దీటుగా మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి చేస్తాం. మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద త్వరలోనే శిల్పారామం పనులు ప్రారంభమవుతాయి’అని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్, అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందులాల్‌ పవార్, వర్జికల్‌ వరల్డ్‌ అడ్వెంచర్స్‌ డైరెక్టర్‌ సుకుమార్, చీఫ్‌ అడ్వయిజర్‌ వెంకట్రావ్, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఆకట్టుకున్న స్కైడైవింగ్‌ విన్యాసాలు..  
పారామోటార్‌ చాంపియన్షిప్‌ పోటీల ప్రారం¿ోత్సవం సందర్భంగా ఢిల్లీకి చెందిన ఉదేప్‌ థాపూర్, మహారాష్ట్రకు చెందిన సాజిద్‌ చౌబ్లెల స్కైడైవింగ్‌ విన్యాసం ఆకట్టుకుంది. ఆకాశంలో 3 వేల అడుగుల ఎత్తులో రెండు పారామోటార్ల నుంచి కిందికి దూకి మధ్యలో పారాచూట్‌లతో భూమిపైకి దిగారు. అలాగే కొందరు పారా పైలట్లు పారామోటార్లతో ఆకాశంలో పలు విన్యాసాలు చేసి ప్రేక్షకులను అలరించారు. సిలిండర్ల సాయంతో నడిచే హాట్‌ ఎయిర్‌బెలూన్‌ను కాసేపు ఆకాశంలో ఎగరేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు