హైదరాబాద్‌లో ప్రి సర్టిఫికేషన్, ట్రైనింగ్‌ ల్యాబ్‌ 

22 Aug, 2021 03:40 IST|Sakshi

ఏర్పాటు చేస్తామన్న ఏఆర్‌ఏఐ బృందం 

రాష్ట్రంలో ఎలక్ట్రానిక్‌ వాహనరంగానికి ఊతమిచ్చే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణకు ఉన్న భౌగోళిక అనుకూలత దృష్ట్యా హైదరాబాద్‌లో ప్రి సర్టిఫికేషన్, ట్రైనింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తామని ఆటోమోటివ్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఏఆర్‌ఏఐ) డైరెక్టర్‌ డాక్టర్‌ రెజీ మథాయ్‌ ప్రకటించారు. గతేడాది రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం, ఏఆర్‌ఏఐ మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో రెజీ నేతృత్వంలోని ఏఆర్‌ఏఐ బృందం రెండురోజుల పర్యటనకుగాను శనివారం రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, ఈవీ విభాగం డైరెక్టర్‌ సుజయ్‌ కారంపూరి నేతృత్వంలోని అధికారులు, ఎలక్ట్రిక్‌ వాహన పరిశ్రమ ప్రతినిధులు ఏఆర్‌ఏఐ బృందంతో టీ వర్క్స్‌ కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రి సర్టిఫికేషన్, ట్రెయినింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు అవసరమైన వసతుల కోసం రావిర్యాలలోని ‘ఈ సిటీ’ని కూడా ఏఆర్‌ఏఐ బృందం సందర్శించింది.

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్‌ వాహనరంగానికి తెలంగాణ కేంద్రంగా మారుతోందని, ప్రిసర్టిఫికేషన్, టెస్టింగ్‌ ల్యాబ్‌ వల్ల కొత్త యూనిట్లు ఏర్పాటు చేసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రెజీ మథాయ్‌ పేర్కొన్నారు. ఈ ల్యాబ్‌ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్‌ఐఐసీతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆవిష్కరించిన ఈ పాలసీ ద్వారా పెట్టుబడులు వస్తున్నాయని, ప్రిసర్టిఫికేషన్‌ ల్యాబ్‌ రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని మరింత మెరుగుపరుస్తుందని సుజయ్‌ వెల్లడించారు.

కొత్తగా రెండు ఈవీ పార్కులు, టీ వర్క్స్, టీ హబ్‌ తదితరాలతో ఎలక్ట్రిక్‌ వాహన పరిశ్రమను భారీగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం, భారతీయ ఆటోమోటివ్‌ పరిశ్రమ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఏఆర్‌ఏఐకి ఆటోమోటివ్‌ రంగంలో పరిశోధన, అభివృద్ధి సంస్థగా ప్రాముఖ్యత ఉంది. పుణే కేంద్రంగా పనిచేస్తున్న ఏఆర్‌ఏఐకి చెన్నైలోనూ ప్రాంతీయ కార్యాలయం ఉంది.   

మరిన్ని వార్తలు