బండి సంజయ్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ 

9 Jan, 2022 04:25 IST|Sakshi

యోగక్షేమాలు, పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆరా  

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పట్ల ఇటీవల పోలీసులు వ్యవహరించిన తీరు, ఘటన పూర్వాపరాలపై ప్రధాని మోదీ ఆరాతీశారు. శనివారం సంజయ్‌ను ఫోన్‌లో పరామర్శించారు. రాష్ట్రంలో బీజేపీ పట్ల ప్రజల్లో రోజురోజుకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలోనే సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ దాడులకు పాల్పడుతోందేమోనన్న సందేహాన్ని మోదీ వ్యక్తంచేసినట్లు తెలిసింది. కొత్త జిల్లాలకు ఉద్యోగులను కేటాయిస్తున్న తీరుపై బీజేపీ సాగిస్తున్న పోరు, 2న జాగరణ దీక్ష సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, తదితర విషయాలను మోదీ తెలుసుకున్నట్లు సమాచారం.

అరెస్ట్‌లకు భయపడేది లేదని సంజయ్‌ పేర్కొనడంతో మోదీ అభినందించారు. బండితో జైలుకు వెళ్లిన, గాయపడిన కార్యకర్తల గురించి తెలుసుకున్నారు. ప్రజాసమస్యలపై పోరాటాన్ని కొనసాగించాలని, ప్రజాస్వామ్య పరిమితులకు లోబడి ఉద్యమించాలని మోదీ సూచించారు. సంజయ్‌ మాతృమూర్తి శకుంతలకు నమస్కారాలు తెలియజేసిన మోదీ.. సంజయ్‌ సతీమణి అపర్ణ, పిల్లలు సాయి భగీరథ్, సాయి సుముఖ్‌లకు ఆశీర్వాదా లు తెలిపారు.   

మరిన్ని వార్తలు