కుక్కల నుంచి రక్షణ కల్పించండి 

12 Aug, 2020 05:41 IST|Sakshi

హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం.. స్పందించిన ధర్మాసనం 

ఆ గ్రామంలో రేబిస్‌ వ్యాక్సిన్, అంబులెన్స్‌ అందుబాటులో ఉంచాలని ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: తమ గ్రామంలో 26 మందిని కుక్కలు కరిచాయని, వాటి నుంచి రక్షణ కల్పించడంతో పాటు రేబిస్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచేలా ఆదేశించాలని నల్లగొండ జిల్లా ముడుగులపల్లి మండలం కన్నెకల్‌ గ్రామానికి చెందిన ఉపేందర్‌రెడ్డి ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. దీన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. కుక్కకాటుకు వినియోగించే రేబిస్‌ వ్యాక్సిన్‌ను అన్ని జిల్లాలకు ఎలా సరఫరా చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే కన్నెకల్‌ గ్రామంలో కుక్క కాటు బారిన పడిన వారిని తరలించేందుకు అంబులెన్స్, రేబిస్‌ వ్యాక్సిన్‌ను గ్రామస్తులకు అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించింది.

ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కన్నెకల్‌ గ్రామస్తులు తరచుగా కుక్కకాటుకు గురవుతున్నారని, రేబిస్‌ వ్యాక్సిన్‌ ఆ గ్రామంలో అందుబాటులో లేకపోవడంతో 10 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని పిటిషనర్‌ తరఫున వేణుధర్‌రెడ్డి నివేదించారు. కన్నెకల్‌లో పశువుల ఆస్పత్రితోపాటు హోమియో ఆస్పత్రి అందుబాటులో ఉన్నాయని, డాక్టర్, నర్సింగ్‌ సిబ్బందిని నియమించి రేబిస్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచేలా ఆదేశించాలని కోరారు. డాక్టర్‌ను నియమించాలా వద్దా అన్నది విధానపరమైన నిర్ణయమని, ఈ మేరకు ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు