అమిత్‌షాతో పీవీ సింధు భేటీ 

17 Sep, 2023 01:22 IST|Sakshi
శనివారం హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి పుష్పగుచ్ఛం అందిస్తున్న క్రీడాకారిణి పీవీ సింధు

శనివారం రాత్రే హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి 

నేడు పరేడ్‌ గ్రౌండ్స్‌లో హైదరాబాద్‌ విమోచన దినోత్సవాలు 

ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్న అమిత్‌షా 

ఢిల్లీకి తిరిగి వెళ్లే ముందు రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా భేటీ

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌కు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, సీనియర్‌ నేతలు డీకే అరుణ, బండి సంజయ్, కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు, విజయశాంతి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అమిత్‌షా సీఆర్పీఎఫ్‌ సెక్టార్‌ ఆ ఫీసర్స్‌ మెస్‌కు చేరుకుని బస చేశారు. ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హై దరాబాద్‌ విమోచన దినోత్సవాల్లో అమిత్‌షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. 

పీవీ సింధుకు అభినందన 
కేంద్ర మంత్రి అమిత్‌షాను ఒలింపిక్‌ పతక విజేత, బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శనివారం రాత్రి తన తండ్రి, వాలీబాల్‌ మాజీ క్రీడాకారుడు పీవీ రమణ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలతో కలసి ఆమె సీఆర్పీఎఫ్‌ సెక్టార్‌ ఆఫీసర్స్‌ మెస్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడంతోపాటు యువతకు స్ఫూర్తిగా నిలిచావంటూ సింధును అమిత్‌షా అభినందించారు. దేశంలో క్రీడల అభివృద్ధి, అందించాల్సిన ప్రోత్సాహం, ఫిట్‌నెస్‌గా ఉండటంపై వారు మాట్లాడుకున్నట్టు తెలిసింది.  

ప్రముఖులపై బీజేపీ ఫోకస్‌లో.. 
ఇటీవల సినీ, సంగీత, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో ప్రభావం చూపే ప్రముఖులను బీజేపీ జాతీయ నేతలు కలసి అభినందించడం తెలిసిందే. గతంలో రాష్ట్ర పర్యటనలకు వచ్చిన సందర్భంగా సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ను, బాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌లను అమిత్‌షా కలుసుకున్నారు. తాజాగా పీవీ సింధును కలిశారు. అలాగే సినీనటుడు నితిన్, మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్, ఆర్థిక, రాజకీయరంగాల విశ్లేషకుడు కె.నాగేశ్వర్‌లను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిశారు.  

రాష్ట్ర నేతలతో కీలక భేటీ.. 
పరేడ్‌ గ్రౌండ్స్‌ కార్యక్రమం అనంతరం సీఆర్పీఎఫ్‌ సెక్టార్‌ ఆఫీసర్స్‌ మెస్‌లో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో అమిత్‌షా సమావేశం కానున్నారు. ఈ భేటీ కోసం జాతీయ కార్యవర్గ సభ్యులు, కీలక నేతలకు మాత్రమే పిలుపు అందినట్టు పారీ్టవర్గాలు చెప్తున్నాయి. అయితే ఆదివారం విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ బీసీలకోసం ఓ ప్రత్యేక పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభిస్తుండటంతో.. దీనికి సంబంధించి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో కార్యక్రమం జరగనుంది. జి.కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌ అందులో పాల్గొంటుండటంతో.. అమిత్‌షాతో భేటీకి హాజరయ్యే అవకాశాలు లేవని సమాచారం. ఆఫీసర్స్‌ మెస్‌లో భేటీ తర్వాత అమిత్‌షా ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు. 

నేడు పరేడ్‌ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవం 
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆదివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. అమిత్‌షా, కిషన్‌రెడ్డి, ఇతర నేతలు ఉదయం తొమ్మిది గంటల సమయంలో అక్కడికి చేరుకుంటారు. తొలుత అమర సైనికుల స్తూపం వద్ద నివాళులు అరి్పస్తారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అరి్పస్తారు. పారామిలిటరీ దళాల కవాతు స్వీకరించి ప్రసంగిస్తారు. కార్యక్రమం ప్రాంగణంలో 21 వేల మంది సందర్శకులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు.  

మరిన్ని వార్తలు