-

రూ.2 వేల వాచీ.. రూ.59 వేలకు విక్రయం!

31 May, 2023 02:18 IST|Sakshi

విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ముసుగులో క్యూ–నెట్‌ సంస్థ దందా

సాక్షి, హైదరాబాద్‌:  సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో ఈ ఏడాది మార్చిలో జరిగిన అగ్నిప్రమాదం క్యూ–నెట్‌ మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ (ఎంఎల్‌ఎం) సంస్థ అక్రమ దందాను మరోసారి తెరపైకి తెచ్చింది. ఆ దుర్ఘటనలో చనిపోయిన ఆరుగురూ దీని ఉద్యోగులే.

ఈ ఘటనపై నమోదైన కేసులను దర్యాప్తు చేసిన హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) అధికారులు.. ఈ సంస్థ సౌత్‌ ఇండియా ఆపరేషన్స్‌ హెడ్‌ గుమ్మడిల్లి రాజేశ్‌ అలియాస్‌ రాజేశ్‌ ఖన్నాను బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ సంస్థ ఎంఎల్‌ఎం పేరిట తక్కువ ఖరీదైన వస్తువులను అత్యంత ఎక్కువ రేటుకు అమ్ముతోందని.. రూ.2 వేల వాచీని రూ.59 వేలకు విక్రయించినట్టు ఆధారాలు సేకరించామని హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. 

కేసులు నమోదవడంతో పేరు మార్చి.. 
హాంకాంగ్‌ కేంద్రంగా ఎంఎల్‌ఎం దందా చేస్తున్న క్యూ–నెట్‌పై అనేక కేసులు నమోదవడంతో.. విహాన్‌ డైరెక్ట్‌ సెల్లింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ‘వీ–ఎంపైర్‌’ పేర్లతో మళ్లీ దందా ప్రారంభించింది. ఈ సంస్థలో టెలీకాలర్లు, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్, ప్రమోటర్స్, టీమ్‌ లీడర్లుగా చాలామంది పనిచేస్తున్నారు.

స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌ ఐదో అంతస్తులోని ఫ్లాట్‌ నంబర్‌ 511లో దీని కార్యాలయం ఉంది. రాజేశ్‌ ఖన్నా, ఉపేందర్‌రెడ్డి, శివనాగ మల్లయ్య, కటకం మల్లేశ్, నాగమణి సహా 12 మంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నెలా కనీసం రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించవచ్చంటూ ఎరవేయడం.. ఇప్పటికే ‘వీ–ఎంపైర్‌’లో చేరినవారు నెలకు రూ.50వేల నుంచి రూ.1.5లక్షల దాకా సంపాదిస్తున్నారని అమాయకులకు ఎర వేస్తున్నారు. 

మూడు కోట్లు వసూలు చేసి..
దీనిపై దర్యాప్తు చేసిన పోలీసు బృందం.. ఇప్పటివరకు హైదరాబాద్‌లోనే 159 మంది బాధితుల నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్టు గుర్తించింది. దేశవ్యాప్తంగా ఇంకా ఎంతో మంది బాధితులు ఉంటారని పోలీసులు తెలిపారు. రాజేశ్‌ ఖన్నా వద్ద లభించిన 35 బ్యాంకు ఖాతాల్లోని రూ.54 కోట్ల నగదును ఫ్రీజ్‌ చేశామని.. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు