వెజ్‌ ప్లేట్‌ రూ.30.3 .. నాన్‌ వెజ్‌  రూ.61.2 

11 Dec, 2023 05:29 IST|Sakshi

హోటల్‌లో ఫుడ్‌ ఆరగిస్తే.. వేలకు వేలు బిల్లు కడుతుంటాం. వెజ్‌ అయినా, నాన్‌ వెజ్‌ అయినా వందల్లోనే మొదలవుతుంది. మరి మన ఇంట్లోనే వండుకుంటే.. ఎంత ఖర్చవుతుంది? నిజానికి బాగా తక్కువే. అందులోనూ సీజన్‌ను బట్టి, కూరగాయలు, చికెన్, మటన్, ఇతర మాంసాహార ధరలను బట్టి ఖర్చు మారిపోతూనే ఉంటుంది.

ఈ క్రమంలోనే ప్రఖ్యాత క్రిసిల్‌ సంస్థ.. వంటల్లో వాడే సరుకుల ధరల ఆధారంగా.. ఇంట్లో వండుకునే ఒక్కో ప్లేట్‌ ఆహారానికి ఎంత ఖర్చవుతుందనే అంచనాలు వేసింది. దాదాపు ఏడాదిన్నర కాలంలో నెలనెలా సరుకుల ధరలను పరిశీలించి.. సగటు థాలీ (ప్లేట్‌ భోజనం) ఖర్చు ఎంతెంత అన్న లెక్కలతో తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. 

టమాటాలు, ఉల్లి ధరలే కీలకం: క్రిసిల్‌ సంస్థ వివిధ రకాల మాంసంతోపాటు వంటల్లో వాడే పప్పులు, కూరగాయలు, నూనెలు, మసాలాల ఖర్చునూ కలిపి భోజనం తయారీకి అయ్యే ఖర్చును లెక్కించింది. వంట చేసేందుకు అయ్యే గ్యాస్‌ ఖర్చునూ కలిపింది. అయితే ప్రధానంగా ఇటీవలి కాలంలో టమాటా, ఉల్లి ధరలు బాగా పెరిగిపోవడం, తర్వాత తగ్గడం నేపథ్యంలో సగటు థాలీ ఖర్చులోనూ హెచ్చుతగ్గులు వచ్చాయని ఈ నివేదిక వెల్లడించింది. భారతదేశంలోని నలుమూలలా ఉన్న రాష్ట్రాల నుంచి ధరల వివరాలు తీసుకుని, సగటు ధరలతో ఈ అంచనాలు వేసినట్టు తెలిపింది. 

ఎలాగైతేనేం హోటల్లో ఫుడ్డు తినేకంటే ఇంట్లో వండుకుంటే బాగా డబ్బులు మిగులుతాయనీ నివేదిక చెప్పినట్టే మరి!  

>
మరిన్ని వార్తలు