karimnagar: బారసాల మురిపెం తీరకముందే..

30 Dec, 2021 14:03 IST|Sakshi
రోదిస్తున్న కుటుంబీకులు

సాక్షి, ఎల్లారెడ్డిపేట(కరీంనగర్‌): బారసాల చేసి నోటి నిండా బిడ్డను పిలుచుకోకుండానే ఆ దేవుడు ఆ దంపతులకు తీరని వేదనను మిగిల్చాడు. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చినా ఆ తల్లి మురిపెంగా 21వ రోజు(నామకరణం) చేసిన మరుసటి రోజే మృత్యువు ఆ పసికందును కబళించడం అందరినీ కలచివేసింది. కనుపాప కళ్లముందే తుదిశ్వాస విడవడంతో ఆ కన్నతల్లి గుండెలు అవిసేలా రోదించడం అందరినీ కలచి వేసింది.

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లెకు చెందిన చెరుకు మానస–భాస్కర్‌ దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు గౌతమి(3) ఉండగా, 22రోజుల క్రితం మరో ఆడబిడ్డకు మానస జన్మనిచ్చింది. నామకరణం జరిపిన మరుసటిరోజు మరోసారి వైద్య చికిత్సకోసం మానస ఇద్దరు కూతుర్లు, అత్త ఎల్లవ్వతో కలిసి ఓ ఆటోలో బుధవారం సిరిసిల్ల వెళ్తుండగా పెద్దూరు శివారులో టాటా పికప్, ఆటో ఒకదానినొకటి ఢీకొన్నాయి.

ఈ సంఘటనలో పసికందు ఆటోలో ఉన్న తల్లి ఒడి నుంచి జారి కింద పడింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో సిరిసిల్లకు తరలించేలోపే మరణించింది. మానసతో పాటు ఎల్లవ్వ, గౌతమిలు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన రాగట్లపల్లెలో విషాదం నింపింది.

బిడ్డ కోసం రూ.2లక్షల ఖర్చు..
ప్రమాదంలో మరణించిన పసికందును కడుపులో ఉండగా అనారోగ్యంతో ఉన్న బిడ్డను బతికించుకోవడానికి తల్లిదండ్రులు అప్పులు చేసి ఆస్పత్రుల్లో రూ.2లక్షల వరకు ఖర్చు చేశారు. ఉమ్మినీరు తక్కువగా ఉండడం, పాప ఎదుగుదల సరిగా లేని కారణంగా వైద్యుల సూచనల మేరకు బిడ్డను దక్కించుకోవడానికి దొరికిన కాడల్లా అప్పులు చేసి ఆరోగ్యంగా బిడ్డకు జన్మనిచ్చారు.

బిడ్డ పుట్టిన మురిపెం మూడునాళ్లు నిలవకముందే రోడ్డు ప్రమాదం ఆ పసికందును దంపతులకు దూరం చేసి కడపుకోతను మిగిల్చింది. విగత జీవిగా మారిన బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.   

చదవండి: వివాహితకు మరో వ్యక్తితో పరిచయం.. ఏడాదిగా సహజీవనం

మరిన్ని వార్తలు