వనం చేరిన తల్లులు

20 Feb, 2022 04:00 IST|Sakshi
సమ్మక్క, సారలమ్మలను గద్దెల పైనుంచి తీసుకెళ్తున్న పూజారులు

సాక్షిప్రతినిధి, వరంగల్‌: నాలుగు రోజులపాటు లక్షల మంది భక్తులను ఆశీర్వదించిన వనదేవతలు జనం నుంచి వనంలోకి వెళ్లారు. మేడారంలో గద్దెలపై కొలువైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను పూజారులు వనంలోకి తీసుకెళ్లారు. ఈ ఘట్టంతో మేడారం మహా జాతర ముగిసింది. జనసంద్రమైన అడవులు మళ్లీ మామూలుగా మారాయి. కిక్కిరిసిన భక్తులతో కాలు కదిపేందుకు వీలుగాని గద్దెల ప్రాంతం ఖాళీ అయ్యింది. ఆదివాసీ వాయిద్యాలు, సంప్రదాయాలతో పూజారులు (వడ్డెలు) శనివారం సాయంత్రం ఆరుగంటలకు వనప్రవేశ ప్రక్రియను ప్రారంభించారు.

ఉద్విగ్నంగా ఈ ఘట్టం సాగింది. జాతర చివరి రోజు దాదాపు ఎనిమిది లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆఖరి రోజున భారీగా జనం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవతల వనప్రవేశం తర్వాత సైతం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క గద్దెపై భక్తులు సమర్పించిన చీర, సారె, బంగారం, పసుపు కుంకుమలను మేడారం వాసులు తీసుకున్నారు. దేవతల ప్రసాదాన్ని(బెల్లం) తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. దీంతో ఒక్కసారిగా గద్దెల ప్రాంగణం భక్తుల కోలాహలంతో నిండిపోయింది. దర్శనాల ప్రక్రియను పూర్తిగా నిలిపివేసిన తర్వాత దేవతల వనప్రవేశ ఘట్టం ప్రారంభించారు. గోవిందరాజును దబ్బగట్ల గోవర్ధన్, పొదెం బాబు నేతృత్వంలోని పూజారుల బృందం మేడారం గద్దెల నుంచి 7:20 తరలించారు.

వీరు అర్ధరాత్రి ఏటూరునాగారం మండలం కొండాయికి చేరుకున్నారు. అనంతరం 7:18 గంటలకు సమ్మక్కను గద్దెల నుంచి తరలించారు. కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన మునీందర్‌ నేతృత్వంలోని పూజారుల బృందం గద్దెల వద్ద పూజలు నిర్వహించి సమ్మక్కను అక్కడి నుంచి కదిలించింది. గద్దెల సమీపంలోని ఎదుర్కోళ్ల ప్రదేశం వద్ద మేక బలితో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి సమ్మక్కను చిలకలగుట్టకు చేర్చారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజును7:20 గంటలకు వడ్డెల నేతృత్వంలోని పూజారుల బృందం మేడారం నుంచి కొత్తగూడ మండ లం పూనుగొండ్లకు వైపు తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం వీరు గమ్యాన్ని చేరుకోనున్నారు. మేడారం గద్దెపై ఉన్న సారలమ్మను కాక సారయ్య, కాక కిరణ్, సోలం వెంకటేశ్వర్లు నేతృత్వంలోని పూజారుల బృందం కన్నెపల్లికి తీసుకెళ్లింది. గద్దెపై ప్రతిష్టించిన మెంటె (వెదురు బుట్ట) ను 7:21 గంటలకు తీసుకుని జంపన్నవాగు మీదుగా కన్నెపల్లికి చేర్చారు. దేవతల వనప్రవేశంతో మేడా రం మహా జాతర అధికారికంగా ముగిసింది. కాగా, వచ్చే బుధవారం మేడా రం పూజారులు చేసే తిరుగువారం పండుగతో మహా జాతర అంకం పరిసమాప్తమవుతుంది.

మేడారం రావడం సంతోషంగా ఉంది: గవర్నర్‌
మేడారంలో సమ్మక్క–సారలమ్మలను దర్శించుకోవడం సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ఆమె హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో మేడారం చేరుకున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే సీతక్క పుష్పగుచ్ఛంతో ఆమెకు స్వాగతం పలికారు. తర్వాత గవర్నర్‌ నిలువెత్తు బంగారాన్ని తల్లుల కు సమర్పించుకున్నారు. అనంతరం పట్టువస్త్రాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుకున్నట్లు తెలిపారు.  కాగా, గవర్నర్‌ రాకకు కొద్దిముందే.. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కలెక్టర్‌ కృష్ణాదిత్య, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించి.. మేడారం జాతర విజయవంతమైనట్టు ప్రకటించారు. గవర్నర్‌ వచ్చే సమయానికి  వీరు లేరు. దీంతో జేసీ ఒక్కరే స్వాగతం పలికారు.

ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి: బండి 
సాక్షి, హైదరాబాద్‌: మేడారం జాతరకు వచ్చిన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ విషయంలో ప్రొటోకాల్‌ పాటించకుండా ఘోరంగా అవమానించినందుకు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు, సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మేడారంలో మంత్రులు, అధికారులెవరూ గవర్నర్‌ కార్యక్రమానికి హాజరుకాలేదని ఆరోపించారు. 

మరిన్ని వార్తలు