రూబీ లాడ్జి ప్రమాదం: అంత ఘోరం ఎలా జరిగింది?.. అధికారుల ఆరా

13 Sep, 2022 09:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఎనిమిది మంది టూరిస్టుల ప్రాణాలు బలిగొన్న సికింద్రాబాద్‌ రూబీ అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు ఉన్నతాధికారులు. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఎనిమిది మంది మరణించగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.పెను విషాదం నింపిన ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో..

రూబీ లాడ్జి ఘటనపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. లాడ్జి ఓనర్‌ రంజిత​సింగ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. లాడ్జిలో దిగనవాళ్లు.. కాలిన గాయాలతో పాటు ఊపిరాడక మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చారు. గాంధీతో పాటు మరో రెండు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుల ఫోన్‌ నెంబర్‌ల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నారు పోలీసులు. ఆర్డీవో ఆద్వర్యంలో గాంధీ ఆస్పత్రిలో మృతదేహాలకు పంచనామా నిర్వహిస్తున్నారు.

ప్రమాదానికి అసలు కారణం?
ఇక ప్రమాద సమయంలో కాంప్లెక్స్‌లో 30 మందితో పాటు ఎనిమిది మంది సిబ్బంది ఉన్నట్లు తేలింది. అయితే ప్రమాదానికి  ఈ-బైక్‌ బ్యాటరీ పేలుడే కారణమా? లేదంటే విద్యుత్‌ షాట్‌ సర్క్యూటే కారణమా? అనే విషయాలపై ఎమ్మార్వో, రెవెన్యూ అధికారులు ఆరాలు తీస్తున్నారు. సెల్లార్ లో నిబంధనలకు విరుద్ధంగా ఎలక్ట్రిక్ బైక్ సెంటర్ ఉండడం, అలాగే.. లాడ్జి వున్న చోట.. ఎలక్ట్రిక్ బైక్స్‌ నిర్వాహణకు ఎలా అనుమతి ఇచ్చారని కిందిస్థాయి అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. 

ఇప్పటికే ఘటనా స్థలంలో క్లూస్‌ టీం క్లూస్‌ సేకరించాయి. మరోవైపు కాంప్లెక్స్‌లో అగ్నిమాపక శాఖ నిబంధనలు(ఫైర్‌ సేఫ్టీ రూల్స్‌) ఏ మాత్రం లేవని గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో తప్పించుకునేందుకు దారులు లేవని, బిల్డింగ్ మొత్తానికి ఒకే దారి ఉండడం వల్లే ఘోరం జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. మెట్ల మార్గం గుండా కిందకు రాలేక.. దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుని మృతి చెందినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. సాయంత్రకల్లా ప్రమాదంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఇదీ చదవండి: రూబీ లాడ్జి ప్రమాదంపై ఫైర్‌ అధికారి ఏమన్నారంటే..

మరిన్ని వార్తలు