అనంతగిరికి వెళ్లి అనంతలోకాలకు

1 Feb, 2021 08:41 IST|Sakshi
దివ్య మృతదేహం

సాక్షి, ధారూరు: హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగస్తులు ఆదివారం అనంతగిరి పద్మనాభస్వామి, కోట్‌పల్లి ప్రాజెక్టును సందర్శించేందుకు బయలుదేరారు. ప్రమాదవశాత్తు కారు బోల్తా పడడంతో ఉద్యోగస్తులతోపాటు డ్రైవర్‌ శివ గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో దివ్య (24) మృతి చెందింది. ఈ దుర్ఘటన మండల పరిధిలోని తాండూర్‌–హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై కేరెళ్లి రైతువేదిక సమీపంలో చోటు చేసుకుంది. ఎస్సై సురేష్, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌లుగా పనిచేస్తున్న ముగ్గురు యువతులు, ముగ్గురు యువకులు ఆదివారం ఉదయం అనంతగిరి పద్మనాభ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం కోట్‌పల్లి ప్రాజెక్టుకు వెళ్తున్న క్రమంలో కారును వేగంగా నడుపుతున్న శివసాయి మూలమలుపును గమనించలేదు. దీంతో కారు అదుపు తప్పి ఫల్టీలు కొడుతూపక్కనేఉన్న వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో దండెం నిఖిల్‌(24), హర్షల్‌ కావల్‌కార్‌(27), శృతిక(22), పురుషోత్తం(25), షాజహా న్‌(25)లు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌ శివసాయి(25) కాలుకు, దివ్య తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌ సకాలంలో రాకపోవడంతో క్షతగాత్రులను ఆయన వాహనంలో వికారాబాద్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. డ్రైవర్‌ శివసాయినినగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితికూడా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. హర్షల్‌ కావల్‌కార్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. కాగా డ్రైవర్‌ శివసాయి తన తండ్రి ప్రభుత్వ వాహనాన్ని ఇంట్లో చెప్పకుండా తీసుకవచ్చినట్లు ఎస్సై చెప్పారు. 

మరిన్ని వార్తలు