హైదరాబాద్‌లో స్పోర్ట్స్‌ బైకుల క్రేజు.. అయితే, ఇక్కడో విషయం గమనించాలి..

12 Sep, 2021 10:30 IST|Sakshi

సిటీలో పెరిగిన స్పోర్ట్స్‌ బైకుల క్రేజ్‌ 

గంటకు 120–150 కి.మీ వేగంతో దూసుకెళుతున్న వాహనాలు

సిటీ రోడ్లు ఇందుకు అనుకూలం కాదంటున్న నిపుణులు 

తరచూ ప్రమాదాలతో ఇతరులకూ పొంచి ఉన్న ముప్పు 

‘సిటీ రహదారులు స్పోర్ట్స్‌ బైక్స్‌ వినియోగానికి అనుకూలంగా లేవు. రోడ్ల విస్తీర్ణం, వాహనాల రాకపోకలు రేసింగ్‌కు ఏ మాత్రం తగవు. కొన్ని ప్రత్యేక నిబంధనలతో కూడిన ప్రాంతాల్లోనే స్పోర్ట్స్‌ బైక్‌లు, కార్లు వినియోగించాలి. అందుకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన సౌకర్యాలూ ఉండాలి...’ అని చెబుతున్నారు హైదరాబాద్‌ జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ పాండురంగా నాయక్‌. తాజాగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ స్పోర్ట్స్‌ బైకు ప్రమాదానికి గురై..ఆయన గాయపడిన నేపథ్యంలో నగర రహదారులపై స్పోర్ట్స్‌ బైకుల వినియోగం, రాత్రి వేళల్లో బైకు రేసింగ్‌ల అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

సాక్షి, హైదరాబాద్‌: నగర రహదారులపై స్పోర్ట్స్‌ బైకులు గంటకు 120 నుంచి 150 కి.మీ వేగంతో పరుగులు తీస్తున్నాయి. ఇవి ఇప్పుడు యువతలో క్రేజ్‌గా మారాయి. ఏటా వేల కొద్ది హై ఎండ్‌ కార్లు, బైకులు రోడ్డెక్కుతున్నాయి. వీటి ఖరీదు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటోంది. వీటి సంఖ్య ప్రస్తుతం 10,500 వరకు ఉన్నట్లు ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవలి కాలంలోనే 3 వేలకు పైగా హై ఎండ్‌ కార్లు ఆర్‌టీఏలో రిజిస్టర్‌ అయినట్లు తెలుస్తోంది.  

పెరుగుతున్న హై ఎండ్‌ మోజు.. 
నగరంలో ఏటేటా హై ఎండ్‌ వాహనాలు గణనీయంగా పెరుగుతున్నాయి. 500 నుంచి 2000 సీసీల సామర్థ్యం కలిగిన స్పోర్ట్స్‌ వాహనాలు నగరంలో భారీ సంఖ్యలో వాడుతున్నారు. సినీ తారలు, సంపన్నుల పిల్లలు ఈ బైక్స్‌పై దూసుకెళ్తూ బెంబేలెత్తిస్తున్నారు. ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కొంత కాలంగా కోవిడ్‌ దృష్ట్యా బైక్‌ రేసింగ్‌లు సద్దుమణిగినా ఇటీవలి కాలంలో తిరిగి మొదలయ్యాయని తెలుస్తోంది.  

జాగ్రత్తలు లేకే.. 
బైక్‌ రేసింగ్‌లో పాల్గొనే యువత సరైన జాగ్రత్తలు పాటించడం లేదు. రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నియమాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. దీంతోనే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలోనూ బైకు రేసింగ్‌ ప్రమాదాల్లో పలువురు చనిపోయిన సంఘటనలు ఉన్నాయి.  

అదుపు తప్పి... 
సినీ హీరో సాయిధరమ్‌ తేజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ నడుపుతూ ఐకియా వద్ద ప్రమాదానికి గురైన ఉదంతంలో వేగాన్ని అదుపు చేయలేకపోవడం వల్లనే ఘటన జరిగినట్లు ఆర్‌టీఏ అధికారులు అంచనా వేస్తున్నారు. తను వాహనం నడుపుతున్న మార్గంలో ఆటో, మరో కారు కూడా వెళుతున్నట్లు గమనించారు. వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఆయన బైకు అదుపుతప్పి కింద పడిపోయింది. ఆ ప్రాంతంలో ఇసుక, మట్టి ఉండడం వల్ల కూడా బైకు అదుపు తప్పినట్లు తెలుస్తోంది.

రూ.కోట్లు కుమ్మరించినా...
► గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో బల్దియా కొత్త రోడ్ల నిర్మాణం.. నిర్వహణల కోసం దాదాపు రూ.1100 కోట్లు ఖర్చు చేసింది. అయినా  చినుకుపడితే గుంతలతో ప్రమాదాలు తప్పడం లేవు. రోడ్లపై గుంతలున్నా, కంకర ఉ న్నా, ఇసుక ఉన్నా పట్టించుకుంటున్నవారు లేరు.  
►జీహెచ్‌ఎంసీ ఇంజనీర్ల కంటే ప్రైవేటు ఏజెన్సీలైతే ఎప్పటికప్పుడు నిర్వహణ బాగుంటుందని భావించి ప్రధాన రహదారుల్లోని 709 కి.మీ.ల మేర నిర్వహణకు ప్రైవేటుకిచ్చారు. అయినా ఫలితం కన్పించడం లేదు. ప్రధాన రోడ్లయినా, గల్లీ రోడ్లయినా, నిర్వహణ ఎవరిదైనా రోడ్డెక్కితే చాలు ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లే ని పరిస్థితులు నెలకొన్నాయి. వేగంగా వెళ్లే వాహనాలతోపాటు నెమ్మదిగా వెళ్లేవారు సైతం గుంతల్లో పడి ఆస్పత్రుల పాలయ్యే పరిస్థితి ఉంది.  
► కొత్త రోడ్లు, రోడ్ల నిర్వహణ పేరిట గడచిన ఐదేళ్లలో రూ.2520 కోట్లు ఖర్చు చేశారు. అయినా అదే దుస్థితి. ఏళ్లు గడుస్తున్నా, కోట్లు ఖర్చవుతునా భాగ్యనగర రహదారుల దుస్థితి మారడం లేదు.  
► గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో వెరసి 70 లక్షలకు పైగా వాహనాలుండగా, వీటిల్లో 70 శాతానికి పైగా ద్విచక్రవాహనాలే. వాహనాలు పెరుగుతున్నాయి. కానీ రోడ్లు బాగుపడటం లేవు. 
►  రోడ్లు అద్దాల్లా ఉంచుతామని స్వీపింగ్‌ మెషిన్లను వినియోగిస్తూ ఏటా దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారు.      

మరిన్ని వార్తలు