TS: చలి తీవ్రత.. బడి ‘వణికిపోతోంది’! 

12 Jan, 2023 01:49 IST|Sakshi

చలి తీవ్రతకు తగ్గుతున్న విద్యార్థుల హాజరు 

వెంటాడుతున్న సీజనల్‌ వ్యాధులు 

ప్రభుత్వ హాస్టళ్లలో మరీ దారుణం 

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో చలి తీవ్రత పెరిగి విద్యార్థులు వణికిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గత నాలుగు రోజులుగా విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. హాజరయ్యే విద్యార్థులు కూడా ఏదో ఒక సీజనల్‌ వ్యాధితో బాధపడుతున్నారని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. కొన్ని బడుల్లో కనీస హాజరు శాతం కూడా ఉండటం లేదని, దీంతో బోధన చేపట్టలేకపోతున్నారని చెప్పా యి. అనేకచోట్ల టీచర్లు కూడా చలి ప్రభావానికి లోనవుతున్నారు. మూడు రోజులుగా దాదాపు 3 వేల మంది టీచర్లు సీజనల్‌ వ్యాధితో సెలవు పెట్టినట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న పాఠశాలల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని, తరగతి గదిలో వెచ్చదనం లేకపోవడంతో విద్యార్థులు గజగజ వణికిపోతున్నట్టు విద్యాశాఖాధికారులు చెప్పారు.  

అంతటా అనారోగ్యం 
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో సోమవారం 45 శాతం హాజరు నమోదైనట్టు అధికారులు తెలిపారు. మంగళవారం ఇది 35 శాతానికి తగ్గింది. స్కూల్‌కు రాని ప్రతీ విద్యార్థి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు. విద్యార్థుల్లో జలుబు, దగ్గు, జ్వరం, నీరసం లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఓ జిల్లా విద్యాశాఖాధికారి చెప్పారు. ఆదిలాబాద్, కొత్తగూడెం, ములుగు, నల్లమలకు అనుకుని ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.

ఈ ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎండ కూడా రావడం లేదు. దీంతో శరీర ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి, విద్యార్థులు శ్వాస సమస్యలకు లోనవుతున్నట్టు అధికారులు చెప్పారు. ప్రభుత్వ హాస్టళ్లల్లోని విద్యార్థులు చాలా వరకు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. హాస్టళ్లకు కిటీకీలు లేకపోవడం, పడుకునే నేల మంచును తలపించేలా ఉండటంతో సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇదే క్రమంలో చలికి స్నానం చేసే పరిస్థితి ఉండటం లేదని, దీంతో చర్మవ్యాధులూ సోకుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 

ఇది కీలక సమయమే 
ఒక్కసారిగా వాతావరణంలో మార్పులొచ్చాయి. దీనికి అనుగుణంగా పిల్లల శరీరం ఇప్పటికిప్పుడు అలవాటు పడే అవకాశం ఉండదు. ఇలాంటి సీజ న్లలో వారిలో వ్యాధి నిరోధక శక్తి అంత చురుకుగా పనిచేయదు. ఫలితంగా చలి తీవ్రతకు జలుబు, జ్వరం వంటి వ్యాధులతో నీరసపడే ప్రమాదం ఉంది. చల్లదనానికి నీళ్లు ఎక్కువగా తీసుకోనందున డీ హైడ్రేషన్‌ సమస్యలూ ఉంటాయి. మరో వారంపాటు ఇదే పరిస్థితి ఉండొచ్చు. ఏమాత్రం అనారోగ్యంగా ఉన్న స్కూల్‌కు పంపకపోవడమే మంచిది. దీనివల్ల ఇతర విద్యార్థులకు వైరస్‌ సోకకుండా నియంత్రించవచ్చు. విద్యార్థుల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచేలా ఆకు కూరలు, ఇంట్లో చేసిన వంటలు ఎక్కువగా ఇవ్వాలి. గోరు వెచ్చని నీరు తాగించాలి. 
– డాక్టర్‌ ఎస్‌.కవిత, పిల్లల వైద్య నిపుణురాలు, నిలోఫర్‌ ఆసుపత్రి

ముందే సెలవులివ్వాలి.. 
పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తగ్గింది. చలికాలం ఇబ్బంది పెడుతోంది. ఢిల్లీ వంటి ప్రాంతాల్లో సెలవులు ఇచ్చారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండే పాఠశాలల్లో ఈ తర హా ఆలోచన చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలి. ఈ దిశగా వైద్యరంగం తోడ్పా టు తీసుకోవాలి. సంక్రాంతి సెలవుల తర్వాత కూడా సీజనల్‌ వ్యాధుల బారిన పడే పిల్లల వల్ల వైరస్‌ మరింత వ్యాప్తి జరగకుండా చూడాలి.    
– జి సదానందంగౌడ్, ఎస్‌టీయూటీఎస్, రాష్ట్ర అధ్యక్షుడు 

మరిన్ని వార్తలు