చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

12 Jan, 2023 01:54 IST|Sakshi

ఆయన ఆఫీసులో రహస్య పత్రాలపై దుమారం

దేశద్రోహమంటూ దుమ్మెత్తిపోస్తున్న ప్రత్యర్థులు

నాకేం తెలియదు, పూర్తిగా సహకరిస్తున్నా: బైడెన్‌

క్రిమినల్‌ విచారణపై త్వరలో ఏజీ నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయన కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడ్డ ఉదంతం క్రమంగా చినికి చినికి గాలివానగా మారుతోంది. ఆ పత్రాల్లో బ్రిటన్, ఉక్రెయిన్, ఇరాన్‌లకు సంబంధించిన పలు సున్నితమైన అంశాలున్నట్టు వస్తున్న వార్తలు మరింత దుమారానికి దారి తీస్తున్నాయి. బరాక్‌ ఒబామా హయాంలో బైడెన్‌ ఉపాధ్యక్షునిగా ఉన్నప్పటి సదరు పత్రాలు ఆయన పదవి నుంచి తప్పుకున్నాక ఉపయోగించిన ప్రైవేట్‌ కార్యాలయంలో గత నవంబర్లో బయటపడ్డాయి.

ఈ అంశం సోమవారం వెలుగులోకి వచ్చింది. వాటి ఉనికిని కనిపెట్టింది బైడెన్‌ తరఫు లాయర్లేనని, వెంటనే వారు నేషనల్‌ ఆర్కైవ్స్‌కు సమాచారమిచ్చారని ఆయన వర్గం సమర్థించుకున్నా విపక్షాలు ఇప్పటికే దీనిపై దుమ్మెత్తిపోస్తున్నాయి. 2022 ఆగస్టులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నివాసంలోనూ ఇలాగే భారీ సంఖ్యలో రహస్య పత్రాలను నేషనల్‌ ఆర్కైవ్స్‌ స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఈ విషయమై ట్రంప్‌పై దర్యాప్తు, క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ కూడా జరుగుతున్నాయి. అదే కోవలో బైడెన్‌ కూడా విచారణ ఎదుర్కోక తప్పదంటున్నారు. దీనిపై అటార్నీ జనరల్‌ మెరిక్‌ గార్లండ్‌కు ఇప్పటికే ప్రాథమిక నివేదిక అందింది.

నేషనల్‌ ఆర్కైవ్స్, రికార్డ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఈ విషయాన్ని తనకు నివేదించగానే దీనిపై విచారణ బాధ్యతలను షికాగో అటార్నీ జాన్‌ లాష్చ్‌ జూనియర్‌కు గార్లండ్‌ అప్పగించారు. ఆయన నుంచి ఇప్పటికే అన్ని వివరాలూ తెప్పించుకున్నారు. బైడెన్‌పై పూర్తిస్థాయి నేర విచారణ ప్రారంభించాలా, వద్దా అన్న కీలక అంశంపై గార్లండ్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ట్రంప్‌ రహస్య డాక్యుమెంట్లకు సంబంధించి ఆయన ఫ్లోరిడా ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ సోదాలతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది గార్లండే కావడం విశేషం! అధ్యక్షుల నిజాయితీకి అత్యంత ప్రాధాన్యమివ్వడమే గాక వారి ప్రవర్తన విషయంలో అత్యంత పట్టింపుగా ఉండే అమెరికాలో చివరికిది బైడెన్‌ పదవికి ఎసరు పెడుతుందా అన్నది చూడాలి.

ఏం జరిగింది?
బైడెన్‌ వద్ద పలు రహస్య పత్రాలు బయట పడ్డట్టు సోమవారం అమెరికా మీడియాలో వార్తలొచ్చాయి. దాంతో వైట్‌హౌస్‌ దీనిపై అధికారిక ప్రకటన చేసింది. 2022 నవంబర్‌ 2న వాషింగ్టన్‌ డీసీలోని పెన్‌ బైడెన్‌ సెంటర్లో ఉన్న బైడెన్‌ ప్రైవేట్‌ కార్యాలయాన్ని ఖాళీ చేస్తున్న సందర్భంగా అందులో పలు రహస్య పత్రాలను ఆయన లాయర్లు కనుగొన్నట్టు పేర్కొంది. అవన్నీ ఒబామా అధ్యక్షునిగా, బైడెన్‌ ఉపాధ్యక్షునిగా ఉన్నప్పటివని, అంటే 2013–16 నాటివని చెబుతున్నారు. ప్రెసిడెన్షియల్‌ రికార్డ్స్‌ యాక్ట్‌ పరిధిలోకి వచ్చే పలు పత్రాలు కూడా వీటిలో ఉన్నాయి! అవి రహస్య పత్రాలని తెలియగానే తన లాయర్లు వెంటనే నేషనల్‌ ఆర్కైవ్స్‌కు సమాచారమిచ్చి వాటిని అప్పగించారని బైడెన్‌ చెప్పుకొచ్చారు. ఉపాధ్యక్షునిగా పదవీకాలం ముగిశాక 2017 నుంచి మూడేళ్లపాటు ఆయన ఈ కార్యాలయాన్ని వాడుకున్నారు.

ఆ పత్రాల్లో ఏముంది?
బైడెన్‌ ఆఫీసులో దొరికినవి మామూలు రహస్య పత్రాలేనంటూ తొలుత వార్తలు వచ్చాయి. అయితే వాటిలో బ్రిటన్, ఇరాన్, ఉక్రెయిన్‌లకు సంబంధించి అమెరికా నిఘా వర్గాలు సేకరించిన అత్యంత రహస్య సమాచారం ఉందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్‌ఎన్‌ తదితర వార్తా సంస్థలు తాజాగా వెల్లడించడం సంచలనం రేపుతోంది.

కావాలనే ఆలస్యంగా బయట పెట్టారా?
రహస్య పత్రాలు ప్రైవేట్‌ కార్యాలయంలో దొరకడం ఒక ఎత్తైతే, దాన్ని ఇంతకాలం దాచి ఉంచడం బైడెన్‌కు మరింత ఇబ్బందికరంగా మారేలా కన్పిస్తోంది. 2022 నవంబర్‌ 2న ఈ పత్రాలు వెలుగు చూసినప్పటికి అమెరికాలో కీలకమైన మధ్యంతర ఎన్నికలు మరో వారంలోపే ఉన్నాయి. పత్రాల విషయం అప్పుడే బయటికొస్తే ఆ ఎన్నికల్లో డెమొక్రాట్లకు పెద్ద ఎదురుదెబ్బే తగిలేది. అందుకే దీన్ని దాచి ఉంచినట్టు తేలితే బైడెన్‌కు మరింత తలనొప్పిగా మారడం ఖాయం. మధ్యంతరంలో ప్రతినిధుల సభలో విపక్ష రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ లభించడం తెలిసిందే.

రాజకీయ వేడి
బైడెన్‌ కార్యాలయంలో రహస్య పత్రాలు దొరకడం అధికార డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య దుమారానికి దారి తీస్తోంది. ట్రంప్‌ ఎస్టేట్‌ మాదిరిగా బైడెన్‌ ఇల్లు, కార్యాలయాల్లో ఎఫ్‌బీఐ ఎప్పుడు సోదాలు చేస్తుందంటూ రిపబ్లికన్‌ నేతలు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ట్రంప్‌ అయితే మరో అడుగు ముందుకేసి, రహస్య పత్రాలను కాపాడలేకపోయినందుకు వైట్‌హౌస్‌లో కూడా ఎఫ్‌బీఐ సోదాలు చేయాలన్నారు! ప్రతినిధుల సభలో రహస్య పత్రాల వ్యవహారాలను చూసే శక్తిమంతమైన ఓవర్‌సైట్‌ కమిటీ సారథి అయిన రిపబ్లికన్‌ సభ్యుడు జేమ్స్‌ కోమర్‌ ఇప్పటికే దీనిపై పూర్తి సమాచారమివ్వాలంటూ నేషనల్‌ ఆర్కైవ్స్‌కు, వైట్‌హౌస్‌ కౌన్సెల్‌ కార్యాలయానికి లేఖలు రాశారు.          

  ట్రంప్‌ పత్రాల గొడవ
ట్రంప్‌ అమెరికా అధ్యక్షునిగా తప్పుకున్నాక పలు రహస్య పత్రాలను వైట్‌హౌస్‌ నుంచి తన ఫ్లోరిడా ఎస్టేట్‌కు తీసుకెళ్లారన్న వార్తలు సంచలనం సృష్టించాయి. 2022 ఆగస్టులో ఆయన ఎస్టేట్లో ఎఫ్‌బీఐ సోదాల్లో వందలాది డాక్యుమెంట్లు దొరికాయి. తనకేమీ తెలియదని, ఇదంతా రాజకీయ కుట్ర సాధింపని ట్రంప్‌ ఎదురు దాడికి దిగారు. దొరికినవన్నీ తన వ్యక్తిగత పత్రాలేనంటూ బుకాయించారు. దీనిపై ఇప్పటికే ఆయనపై సివిల్, క్రిమినల్‌ విచారణలు జరుగుతున్నాయి. మొత్తం 3,000కు పైగా డాక్యుమెంట్లను వైట్‌హౌస్‌ నుంచి తరలించినట్టు టంప్ర్‌పై అభియోగాలు నమోదయ్యాయి.

నాకు తెలియదు: బైడెన్‌
వాషింగ్టన్‌: తన కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడ్డట్టు తెలిసి ఆశ్చర్యపోయానని బైడెన్‌ అన్నారు. ‘ఆ పత్రాల గురించి, ఉపాధ్యక్షునిగా నేను తప్పుకున్న తర్వాత నా కార్యాలయంలోకి అవెలా వచ్చాయో నాకు తెలియదు. వాటిల్లో ఏముందో కూడా తెలియదు. వీటిపై జరుగుతున్న విచారణకు పూర్తిగా సహకరిస్తున్నా. ఇలాంటి అంశాలను నేనెంత సీరియస్‌గా తీసుకుంటానో అందరికీ తెలుసు’ అన్నారు. మెక్సికో పర్యటనలో ఉన్న ఆయన మీడియా ప్రశ్నించడంతో ఈ అంశంపై తొలిసారిగా స్పందించారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు