తహసీల్‌ ఆఫీస్‌కే ఆపద !

8 Jan, 2022 23:40 IST|Sakshi

ఆ భవనం ‘ఫారెస్ట్‌’ లో ఉందట...

మండల పరిషత్, కాలేజీ భవనాలు కూడా..

డెబ్బైకి పైగా ఇండ్లు, వందల ఎకరాల పొలాలు...

రైతులకు నిలిచిపోయిన రైతుబంధు

సాక్షి, కామారెడ్డి: శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు తయారైంది రెవెన్యూశాఖ పరిస్థితి. అందరి భూముల సమస్యలను పరిష్కరించే ఆ శాఖకే ఆపద వచ్చిపడింది. భూముల రికార్డులు భధ్రపరచడంతో పాటు భూముల రిజిస్ట్రేషన్లు జరిగే  తహశీల్దార్‌ కార్యాలయ భవనం ఉన్న స్థలం అటవీశాఖదట.  తహసీల్‌ ఆఫీస్,  మండల పరిషత్‌ కార్యాలయం, జూనియర్‌ కాలేజీ భవనం...ఇలా అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలన్నీ అటవీశాఖకు సంబందించిన సర్వేనంబరులోనే ఉన్నాయంటున్నారు. అలాగే 175 మంది రైతులకు సంబందించిన వ్యవసాయ భూములు, 70 కిపైగా నివాసపు గృహాలు కూడా ఆ సర్వేనంబరులోకి వస్తాయట. ఎప్పుడో విడుదల చేసిన అటవీ శాఖ గెజిట్‌లో సదరు సర్వేనంబరు అటవీశాఖదిగా పేర్కొనడం ఇప్పుడు రెవెన్యూ శాఖకు తలనొప్పి తెచ్చిపెట్టింది.

ఫారెస్ట్‌ గెజిట్‌లో పేర్కొన్న సర్వే నంబర్లకు సంబందించి ఎలాంటి పాసుపుస్తకాలు జారీ చేయకూడదని స్పష్టమైన ఆదేశాలున్నాయి. దీంతో ఆ సర్వేనంబరులోని రైతులకు పాసుపుస్తకాల జారీ ఆగిపోయింది. ఫలితంగా రైతుబంధు నిలిచిపోయింది. బాధిత రైతులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే రెవెన్యూ కార్యాలయమే ఆపదలో ఉంటే రైతుల కష్టం తీర్చేదెవరని నోరెల్లబెడుతున్నారు. లింగంపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారికి సమీపంలో 983 సర్వే నంబరులో 450.08 ఎకరాల భూమి ఉంది. ఈ సర్వేనంబరులో 175 మంది రైతులు వందలాది ఎకరాల భూమిని సాగుచేస్తున్నారు. 2005లో 150 ఎకరాలకు పట్టాలతో పాటు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా ఇచ్చారు. రైతులు బోర్లు తవ్వించుకుని పంటలు సాగు చేస్తున్నారు. పంట రుణాలు పొందారు. కొంత కాలం రైతుబంధు కూడా అందుకున్నారు. అదే సర్వేనంబరులో మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు.  అలాగే 70 కి పైగా ఇండ్లు కూడా నిర్మించుకుని ఉంటున్నారు. దశాబ్దాల తరబడిగా ఆ స్థలంలో జీవనం సాగుతోంది. 

రికార్డుల ప్రక్షాలణతో వెలుగులోకి....
రాష్ట్ర ప్రభుత్వం భూముల రికార్డుల ప్రక్షాలన మొదలుపెట్టిన సమయంలో అటవీ శాఖ తమ గెజిట్‌లోని సర్వే నంబర్లకు సంబందించిన వివరాలను రెవన్యూ శాఖ ముందుంచింది. రికార్డుల ప్రక్షాలన కొనసాగుతూ ఆ సర్వేనంబరుకు వచ్చేసరికి రెవెన్యూ అధికారులు షాక్‌కు గురయ్యారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం దొరకలేదు. ఫారెస్ట్‌ గెజిట్‌లో పేర్కొన్నదానిని మార్చాలంటే ఇప్పట్లో సాధ్యం అయ్యే పనికాదని కూడా అంటున్నారు. కాగా అటవీ శాఖ గెజిట్‌లో 983 సర్వేనంబరు ఉండడంతో అందులో భూములు కలిగి ఉండి  పంటలు సాగుచేస్తున్న రైతులకు డిజిటల్‌ పాసుపుస్తకాలు అందలేదు. దీంతో రైతులకు రైతుబంధు కూడా నిలిచిపోయింది. అక్కడి రైతులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కడం లేదు. డిజిటల్‌ పాసుపుస్తకాలు రాకపోవడం, ఆ సర్వేనంబరును హోల్డ్‌లో పెట్టడంతో రైతుబంధు నిలిచిపోయింది. దీంతో రైతులు ఆవేధన చెందుతున్నారు.

జడ్పీ సమావేశంలో ఇదే అంశంపై చర్చ....
ఈ నెల 5న జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో లింగంపేట ప్రజాప్రతినిధులు 983 సర్వేనంబరుకు సంబందించిన సమస్యను ప్రస్తావించారు. ఆ సర్వే నంబరు గెజిట్‌లో ఉందని అటవీ శాఖ జిల్లా అధికారి నిఖిత పేర్కొన్నారు. తహశీల్దార్‌ కార్యాలయం కూడా అదే సర్వే నంబరులో ఉందని పేర్కొనడంతో సభలో నవ్వులు పూశాయి. తహశీల్దార్‌ కార్యాలయం అటవీశాఖ సర్వేనంబరులోనిది కావడంతో అందరూ విస్తుపోయారు. తమ చేతిలో ఏమీలేదని అటవీ అధికారులు సభలో పేర్కొన్నారు. అయితే అటవీ శాఖకు సంబందించిన భూమిని కొందరు రియల్టర్లు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని, దానిపై కేసులు వేశారని సభ్యులు పేర్కొనగా తాము కౌంటర్‌ పిటీషన్‌ వేసినట్టు ఆమె వివరణ ఇచ్చారు. 


 
ఫారెస్ట్‌ గెజిట్‌లో పేర్కొనడం వల్లే సమస్య....
983 సర్వేనంబరునుఫారెస్ట్‌ గెజిట్‌లో పెట్టారు. అందువల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గెజిట్‌లో మార్పులు జరిగితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఉన్నతాధికారులకు గతంలోనే నివేదించాం. మా చేతుల్లో ఏమీ లేదు. రైతులు కూడా తిరుగుతున్నారు. పరిష్కారం దొరకాలంటే ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. గెజిట్‌లో ఆ సర్వేనంబరును తొలగిస్తేగానీ ఇబ్బంది పోదని భావిస్తున్నాం.
–అమీన్‌ సింగ్, తహశీల్దార్‌

మరిన్ని వార్తలు