హైదరాబాద్‌కు ‘అమ్మో’నియం నైట్రేట్‌

11 Aug, 2020 03:40 IST|Sakshi

చెన్నై నుంచి 180 టన్నులు తరలింపు  

ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్‌ తమిళిసై

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల లెబనాన్‌లోని బీరుట్‌ పోర్టులో నిల్వ చేసిన అమోనియం నైట్రేట్‌ విస్ఫోటనం చెంది భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పోర్టుల్లో నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చెన్నై పోర్టుకు సమీపంలోని మనాలిలో గల ఓ ప్రైవేటు గోదాములో 740 టన్నుల అమోనియం నైట్రేట్‌ను గత ఐదేళ్లుగా నిల్వ ఉంచడం పట్ల స్థానిక రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తంచేశాయి. దీంతో కస్టమ్స్‌ అధికారులు 180 టన్నుల అమోనియం నైట్రేట్‌ను 10 కంటైనర్‌ ట్రక్కుల ద్వారా హైదరాబాద్‌కు తరలించారు. ఆదివారం రాత్రి ఈ విషయం తెలియడంతో ప్రజల భద్రత పట్ల ఆందోళనకు గురయ్యామని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. పరిస్థితిని అంచనా వేయడంతో పాటు తగు చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులతో మాట్లాడినట్లు వివరించారు.

తమిళనాడులోని కరూర్‌కు చెందిన ఓ కంపెనీ లైసెన్స్‌ లేకుండా దక్షిణ కొరియా నుంచి 2015లో 742 టన్నుల అమోనియం నైట్రేట్‌ను చెన్నై పోర్టుకు తరలించగా కస్టమ్స్‌ అధికారులు జప్తుచేశారు. సదరు కంపెనీ, కస్టమ్స్‌ విభాగం మధ్య న్యాయ వివాదాల నేపథ్యంలో ఐదేళ్లుగా అమోనియం నైట్రేట్‌ను ప్రైవేటు గోదాములో నిల్వ ఉంచారు. ప్రస్తుతం 10 కంటైనర్లలో 180 టన్నుల సరుకును హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మరో 27 కంటైనర్లలో 561 టన్నుల అమోనియం నైట్రేట్‌ను మరో వారం రోజుల్లో అక్కడి నుంచి తరలించనున్నారు. చెన్నై పోలీసులు, పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌ హైదరాబాద్‌కు అమోనియం నైట్రేట్‌ తరలింపునకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. కస్టమ్స్‌ నిర్వహించిన వేలం ద్వారా సరుకును కొనుగోలు చేసిన నగరానికి చెందిన ఓ వ్యాపారికి దీనిని అప్పగించనున్నారని తెలిసింది.

మరిన్ని వార్తలు