48 మందికి కరోనా పాజిటివ్‌

30 Nov, 2021 04:32 IST|Sakshi
పాజిటివ్‌ వచ్చిన విద్యార్థినులతో మాట్లాడుతున్న సంగారెడ్డి డీఎంహెచ్‌ఓ 

సంగారెడ్డిలోని ఓ గురుకులంలో కలకలం 

పటాన్‌చెరు టౌన్‌: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని ముత్తంగి గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే బాలికల గురుకుల విద్యాలయంలో ఇంటర్, టెన్త్‌ చదివే 47 మంది విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. వీరందరినీ గురుకులంలోని ‘ఎ’బ్లాక్‌లో ఐసోలేషన్‌ గది ఏర్పాటు చేసి అందులో ఉంచారు. రాష్ట్రంలో సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమైన సంగతి తెలిసిందే. కేసుల సంఖ్య తగ్గడంతో గురుకులాలు తెరిచేందుకూ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

దీంతో అంతా స్కూళ్లు, కళాశాలలు, వసతి గృహాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో ముత్తంగి గురుకులంలో పదోతరగతి చదువుతున్న ఓ విద్యార్థిని జ్వరం బారిన పడింది. తల్లిదండ్రులు శనివారం ఆమెను తీసుకెళ్లి కరోనా టెస్ట్‌ చేయించగా పాజిటివ్‌ తేలింది. దీంతో వారు గురుకుల టీచర్లకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన సిబ్బంది గురుకులంలో 470 మంది విద్యార్థినులు ఉండగా.. ఆదివారం 261 మంది విద్యార్థినులు, సిబ్బందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు జరిపించారు.

పరీక్షల్లో 37 మంది పదో తరగతి విద్యార్థినులు, ఐదుగురు ఇంటర్‌ విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలు మొత్తం 43 మందికి పాజిటివ్‌ తేలింది. సమాచారం తెలుసుకున్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి గాయత్రీదేవి, ఆర్డీఓ నాగేష్, పటాన్‌చెరు తహసీల్దార్‌ మహిపాల్‌ గురుకులాన్ని సందర్శించి కోవిడ్‌ బారిన పడిన విద్యార్థినులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. సోమవారం మిగిలిన 209 మంది విద్యార్థినులకు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో టెస్టులు నిర్వహించగా, మరో ఐదుగురు ఇంటర్‌ విద్యార్థినులకు కూడా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా బారిన పడిన విద్యార్థినుల సంఖ్య 47కు చేరింది.  

మరిన్ని వార్తలు