పోలీస్‌ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు 

30 Nov, 2021 04:29 IST|Sakshi
భవానీపురం పీఎస్‌ నూతన భవనాన్ని ప్రారంభించి విజిటర్స్‌ బుక్‌లో అభిప్రాయాన్ని రాస్తున్న హోం మంత్రి సుచరిత, చిత్రంలో డీజీపీ సవాంగ్, మంత్రి వెల్లంపల్లి

ఉమెన్‌ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు 

98 లక్షల మంది మొబైల్స్‌లో దిశ యాప్‌  

హోం మంత్రి మేకతోటి సుచరిత 

భవానీపురం (విజయవాడ పశ్చిమ):  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోలీస్‌ వ్యవస్థలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులతో స్మార్ట్‌ పోలీసింగ్‌లో ఏపీ నంబర్‌ వన్‌గా నిలిచిందని హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. విజయవాడ హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో నూతనంగా నిర్మించిన భవానీపురం మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ను సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గతంలో కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు పోలీసులు 250 రోజులు తీసుకునేవారని, ఇప్పుడు 42 రోజుల్లోనే సమర్పించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పోలీస్‌ స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యలను సత్వరం పరిష్కరించేలా పోలీస్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. 

మహిళల కోసం ఉమెన్‌ హెల్ప్‌ డెస్క్‌.. 
వివిధ సమస్యలపై పోలీస్‌ స్టేషన్లకు వచ్చే మహిళల కోసం ఆయా పోలీస్‌ స్టేషన్లలో ఉమెన్‌ హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలోని 14,500 మంది మహిళా పోలీసులు వీటిద్వారా సేవలందిస్తారని సుచరిత తెలిపారు. మహిళలు, బాలికల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 98 లక్షల మంది మహిళలు తమ మొబైల్స్‌లో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు.

రాష్ట్రంలో సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేశామన్నారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, నగర పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎం.చిరంజీవిరెడ్డి, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెస్ట్‌ ఏసీపీ డాక్టర్‌ కె.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు