టీచర్ల పరస్పర బదిలీలకు మోక్షం

17 Jun, 2022 00:47 IST|Sakshi

విద్యాశాఖకు నేడు ఫైల్‌ 

20న ఉత్తర్వులు! 

కోర్టు తీర్పునకు లోబడే వారికే బదిలీలు

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కోర్టు తీర్పునకు లోబడి ఉంటామని ఒప్పంద పత్రం సమర్పించిన 1,260 మంది టీచర్ల పరస్పర బదిలీలపై ఈ నెల 20వ తేదీ.. సోమవారం నాటికి ఉత్తర్వులిచ్చే వీలుంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను శుక్రవారం క్లియర్‌ చేసి, విద్యాశాఖకు పంపుతామని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి.శేషాద్రి తెలిపారని యూటీఎఫ్‌ నేతలు చావా రవి, లక్ష్మారెడ్డి తెలిపారు.

గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ, జీఏడీ నుంచి ఫైల్‌ అందిన తర్వాత విద్యాశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారని, సోమవారం బదిలీల ఉత్తర్వులు వెలువడతాయని శేషాద్రి స్పష్టం చేశారని వెల్లడించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం గత ఏడాది 317 జీవోను అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల స్థానికతను ధ్రువీకరిస్తూ, కొంతమందిని కొత్త జిల్లాలకు పంపింది.

అయితే, పరస్పర బదిలీలకు అనుమతించాలని ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి చేశాయి. అందుకు ప్రభుత్వం ఒప్పుకోవడంతో 2,598 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పరస్పర బదిలీలు కోరుకునే వారి పాత సర్వీసును కొనసాగించబోమని, కొత్తగా చేరినప్పటి నుంచే సర్వీసు వర్తింపజేస్తామని ప్రభుత్వం మార్గ దర్శకాలు వెలువరించింది.

దీంతో పరస్పర బదిలీ లపై కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఈ క్రమంలో కోర్టు ఏ తీర్పు ఇచ్చినా కట్టుబడి ఉంటామని అంగీ కార పత్రం ఇచ్చిన వారిని బదిలీ చేసేందుకు విద్యాశాఖ సమ్మతించింది. దీంతో 1,260 మంది ఒప్పంద పత్రాలు సమర్పించారు. వీరిని బదిలీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

పదోన్నతుల మాటేంటి?
బదిలీలు, పదోన్నతులను ఏక కాలంలో పూర్తి చేస్తామని గత కొన్ని నెలలుగా ప్రభుత్వం చెబుతోంది. కానీ పదోన్నతుల ప్రక్రియపై ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం వెలువరించలేదు. కాగా, ఈ నెలాఖరుకు పదోన్నతుల ప్రక్రియ చేపడతామని ఉపాధ్యాయ సంఘాలకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇటీవల తెలిపారు.

ఉపాధ్యాయులకు 2015లో ప్రమోషన్లు ఇచ్చారు. అప్పటినుంచి తదుపరి పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారంలోనూ న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి. త్వరలో వివాదం పరిష్కరించి, ప్రమోషన్లు ఇస్తామని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పడే ఖాళీలను కొత్తవారితో భర్తీ చేసే వీలుందని చెబుతున్నారు.    

మరిన్ని వార్తలు