రాజన్న, నర్సన్న ప్రసాదాలు పొందడం ఇక సులువే!

28 Mar, 2021 04:10 IST|Sakshi

తపాలా శాఖతో దేవాదాయ శాఖ ఒప్పందం 

వివరాలు నమోదు చేసుకుంటే రెండు మూడు రోజుల్లో స్వామి ప్రసాదం

సాక్షి, హైదరాబాద్‌/వేములవాడ: రాష్ట్రంలోని పది ప్రధాన దేవాలయాల ప్రసాదాలను నేరుగా ఇళ్లకే పంపే ప్రత్యేక సేవను దేవాదాయ శాఖ ప్రారంభించింది. ఇందుకు శనివారం తపాలా శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి, కొండగట్టు ఆంజనేయ స్వామి, కొమురవెల్లి మల్లికార్జున స్వామి, సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళీ, సికింద్రాబాద్‌ గణేశ్, బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ, కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి దేవాలయాల్లో ప్రస్తుతం ఈ సేవలు ప్రారంభించారు.

భక్తులు ఈ దేవాలయాల ప్రసాదాలు కావాలని స్థానిక తపాలా కార్యాలయానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటే రెండు మూడు రోజుల్లో ఆయా ఆలయాల నుంచి ప్రసాదం వారి ఇంటికి తపాలా ద్వారా చేరుతుంది. అయితే, ఆయా దేవాలయాలకు ప్రత్యేక ప్రసాదాలుంటాయి. పులిహోర, దధ్యోదనం, లడ్డూ, రవ్వకేసరి లాంటివి. కానీ, ఇవి రెండుమూడు రోజుల పాటు నిల్వ ఉండే అవకాశం ఉండదు. దీనికోసం తపాలా ద్వారా డ్రైఫ్రూట్స్, రవ్వ పొడి ప్రసాదాలను మాత్రమే పంపనున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న 1.60 లక్షల తపాలా కార్యాలయాలలో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా ఆయా దేవాలయాల ఆర్జిత సేవలు నిర్వహించుకునే అవకాశాన్ని దేవాదాయ శాఖ గతంలోనే ప్రారంభించింది. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ నేరుగా తమ పేరుతో జరిగే పూజల్లో పాల్గొనే అవకాశం లేని వారు ఆన్‌లైన్‌లో గోత్రనామాలు, పూజ జరగాల్సిన తేదీని బుక్‌ చేసుకుంటే ఆ రోజు వారి పేరిట పూజలు నిర్వహిస్తున్నారు. ఇందు కోసం ఐటీ శాఖ రూపొందించిన టీ యాప్‌ ఫోలి యో ద్వారా 22 దేవాలయాల్లో ఈ సేవలు పొందే వీలుంది.

తాజాగా పూజలతోపాటు ప్రసాదాలు కూడా పొందే వీలును తపాలాశాఖతో కలిసి ఏర్పా టు చేసింది. శనివారం అరణ్య భవన్‌లోని కార్యాలయంలో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంలో దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్, తపాలాశాఖ తెలంగాణ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ ఎస్‌.రాజేంద్రకుమార్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ కృష్ణవేణి, హైదరాబాద్‌ రీజియన్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ పీవీఎస్‌రెడ్డి, హైదరాబాద్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ సాగర్‌ హనుమాన్‌ సింగ్, డైరెక్టర్‌ ఆఫ్‌ పోస్టల్‌ సర్వీసెస్‌ ఎస్వీ రావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు